ఇంత క్రూరంగానా: భార్యను కుర్చీకి కట్టేసి నిప్పు పెట్టాడు.. వీళ్లది లవ్ మ్యారేజ్

ఇంత క్రూరంగానా: భార్యను కుర్చీకి కట్టేసి నిప్పు పెట్టాడు.. వీళ్లది లవ్ మ్యారేజ్

లక్నో: వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను సజీవ దహనం చేశాడు భర్త. బతికుండగానే భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్‎తో నిప్పటించి అత్యంత క్రూరంగా హత్య చేశాడు. అనంతరం ఇంటికి నిప్పంటించి పిల్లలతో కలిసి పారిపోయాడు. ఈ దిగ్భ్రాంతికర ఘటన ఉత్తరప్రదేశ్‎లోని కనౌజ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..

కనౌజ్ జిల్లాలోని జగత్‌పూర్‌ నివాసి అయిన సుఖ్‌బీర్ సింగ్ 11 సంవత్సరాల క్రితం సోనమ్‌ అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడి వయస్సు ఏడు సంవత్సరాలు. కుమార్తె ఏజ్ ఐదు సంవత్సరాలు. సుఖ్‌బీర్ హర్యానాలోని హిసార్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉండేవాడు. అతడి భార్య, పిల్లలు జగత్‌పూర్‌‎లోనే నివాసం ఉంటున్నారు. 15 రోజుల క్రితమే ఆ ఉద్యోగానికి రాజీనామా సొంత గ్రామానికి వచ్చాడు. 

ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఒక యువకుడితో తన భార్యకు ఉన్న అక్రమ సంబంధం గురించి అతనికి తెలిసింది. దీంతో సుఖ్‎బీర్ భార్యపై నిఘా పెట్టడం మొదలుపెట్టాడు. ఒక రోజు సోనమ్‌ ప్రియుడితో ఫోన్ మాట్లాడుతూ భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది. ఈ విషయంపై భార్యభర్తలు మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం (నవంబర్ 5) కూడా ఇదే విషయంపై భార్యభర్తల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను మోసం చేసిందన్న బాధ, కోపం, ఆవేశంలో సుఖ్‎బీర్ దారుణానికి ఒడిగట్టాడు. భార్యను కుర్చీకి కట్టేసి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. అనంతరం పిల్లలతో కలిసి పారిపోయాడు. సుఖ్‎బీర్ ఇంట్లో నుంచి మంటలు, సోనమ్ అరుపులు విన్న స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. 

హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. సుమారు గంటన్నర శ్రమ తర్వాత మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది ఇంట్లోకి ప్రవేశించే సమయానికి సోనమ్ మృతి చెందింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న సుఖ్‎బీర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భార్యను సజీవ దహనం చేసిన ఘటనతో జగత్‌పూర్‌ గ్రామ వాసులు భయాందోళనకు గురయ్యారు.