ఈ మధ్య కాలంలో తరుచుగా వింటున్న పదం ప్రీడయాబెటిస్. అంటే షుగర్ లేకున్నా రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం. ఇది టైప్ 2 డయాబెటిస్ రావడానికి ముందు ఉండే ఓ వార్సింగ్ స్టేజ్. ఈ దశలో చాలామంది అధిక బరువుతో బాధపడుతుంటారు. అలాంటి వారిపై ఇటీవల జరిపిన పరిశోధనల్లో నిద్ర క్వాలిటి, సమయం, నిద్ర వ్యవధి చాలాకీలకం అని బరువు మెయింటెన్ చేయడంలో ఇవి చాలా అవసరమని తేల్చారు పరిశోధకులు.
ప్రీడయాబెటిస్ ఉన్నవారు త్వరగా నిద్రపోవడం వల్ల అధిక బరువు తగ్గే అవకాశం ఉందని న్యూయార్క్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జరిపిన కొత్త అధ్యయనం పేర్కొంది. నిద్రపోయే సమయం, వ్యవధి, నాణ్యత వంటివి మూడూ శరీర బరువు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు తెలిపారు.
న్యూయార్క్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసన్ కోల్ మలోన్ మాట్లాడుతూ.. మనం ఎంత సేపు నిద్రపోతున్నాం అనే దానితో పాటు ఎప్పుడు నిద్రపోతున్నాం అనే విషయం కూడా బరువు తగ్గడంలో, మెటబాలిక్ ఆరోగ్యంలో చాలా ముఖ్యమైనది .. చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు.
ఈ అధ్యయనం Nursing Research జర్నల్‌లో ప్రచురితమైంది. రోజుకు 6.5 గంటల కంటే తక్కువ నిద్రపోయే ప్రీడయాబెటిస్ వ్యక్తులు దాదాపు 200 మందిపై ఈ పరిశోధన చేశారు. వారిని రెండు గ్రూపులుగా విభజించి రెండు గ్రూపులకు 8 వారాల పాటు వీడియో కాల్స్ ద్వారా ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. . అదనంగా ఒక గ్రూప్‌కు స్లీప్ కోచింగ్ ఇచ్చారు. నిద్ర వేళను క్రమంగా ముందుకు జరపడం, స్థిరమైన షెడ్యూల్ పాటించడం, పడకను నిద్రతోనే అనుసంధానించేలా అలవర్చుకోవడం వంటివి ఆ సెషన్లలో నేర్పించారు.
8 వారాల తర్వాత చూస్తే, నిద్ర వేళ ఒక్కో గంట ముందుకు జరిగిన కొద్దీ దాదాపు 1.3 పౌండ్లు (0.73 కిలోలు) అదనంగా తగ్గినట్టు గుర్తించారు. నిద్ర వ్యవధి మాత్రమే పెరిగిన వారిలో ఇదే స్థాయి ఫలితం కనిపించలేదు.
రాత్రిపూట ఆలస్యంగా తినడం తగ్గడం, శరీరం ఇన్సులిన్‌ను సమర్థంగా వినియోగించుకునే సమయానికి అనుగుణంగా భోజనం ఉండటం వంటివి ముందు నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలని పరిశోధకులు వివరించారు.
అయితే ఈ అధ్యయనం ఫలితాలు ప్రీడయాబెటిస్‌కు చికిత్సగా పరిగణించరాదని, ఆహారపు అలవాట్లు ,శారీరక శ్రమకు ప్రత్యామ్నాయం కాదని పరిశోధకులు స్పష్టం చేశారు. 8 వారాల కాలంలో రక్తంలో చక్కెర స్థాయుల్లో మార్పు నమోదు కాలేదని కూడా తెలిపారు.
