ప్రపంచంలోనే 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాలో (World’s 50 Best Restaurants 2026) ఇండియాకు చెందిన రెండు రెస్టారెంట్లు చోటు దక్కించుకున్నాయి. మిషెలిన్ గైడ్ గా భావించే అత్యంత ప్రతిష్టాత్మకమైన లిస్టులో చోటు సంపాదించడం భారతీయ వంటకాలకు, దేశీయ రెస్టారెంట్లకు దక్కిన పెద్ద గౌరవంగా భావిస్తున్నారు. రెండు రెస్టారెంట్లతో పాటు టాప్ హోటల్స్ గురించి తెలుసుకుందాం.
పెరూలోని లిమాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2026 బెస్ట్ రెస్టారెంట్స్ ర్యాంకింగ్స్ ను విడుదల చేశారు. ఈ ఏడాది అత్యుత్తమ రెస్టారెంట్‌గా స్పెయిన్‌లోని అసడోర్ ఎట్జెబర్రి (Asador Etxebarri) సెలెక్ట్ అయ్యింది. స్పెయిన్ బాస్క్ ప్రాంతంలోని చిన్న గ్రామంలో ఉన్న ఈ రెస్టారెంట్‌లో చెఫ్ బిట్టర్ అర్గుయింజోనిజ్ అందించే గ్రిల్-ఆధారిత వంటకాలు ఫేమస్.
ఇండియన్ రెస్టారెంట్లు
మాస్క్ (Masque):
ఇండియా నుంచి ఎంపికైన వాటిలో ముంబైకి చెందిన మాస్క్ చోటు దక్కించుకుంది. మాస్క్ రెస్టారెంట్ కు 26వ స్థానం దక్కింది. చెఫ్ వరుణ్ తోట్లాని నేతృత్వంలో నడుస్తున్న ఈ రెస్టారెంట్ ఫస్ట్ టైమ్ ఈ లిస్టులో చోటు సంపాదించింది.
ముంబై మహాలక్ష్మి ప్రాంతంలోని పాత టెక్స్‌టైల్ మిల్లులో ఉంటుంది ఈ రెస్టారెంట్. సాంప్రదాయ భారతీయ వంటకాలను కొత్తగా, ట్రెండుకు తగినట్లు, ఆసక్తికరంగా అందించడం దీని స్పెషల్.
నార్ (Naar):
ఇండియా నుంచి ఎంపికైన మరో రెస్టారెంట్ నార్. దీనికి 49వ స్థానం దక్కింది. చెఫ్ ప్రతీక్ సాధు నడుపుతున్న ఈ రెస్టారెంట్ హిమాలయాల పాదాల దగ్గర ఉంటుంది. స్థానిక పదార్థాలు, సీజనల్ మెనూ, పర్యావరణ అనుకూల వంటల శైలికి గుర్తింపుగా సస్టైనబుల్ రెస్టారెంట్ అవార్డు 2026 కూడా అందుకుంది. ఛండీగఢ్ నుంచి 90 నిమిషాల ప్రయాణంతో హిమాలయాల దగ్గర ఉన్న ఈ రెస్టారెంటును చేరుకోచ్చు.
లిస్టులోని మరికొన్ని ముఖ్యమైన రెస్టారెంట్లు:
బ్యాంకాక్‌లోని గగ్గన్ (Gaggan) రెస్టారెంట్ లిస్టులో 2వ స్థానంలో నిలిచింది. కోల్‌కతా కు చెందిన చెఫ్ గగ్గన్ ఆనంద్ నడుపుతున్న ఈ రెస్టారెంట్ ఆసియాలోని బెస్ట్ రెస్టారెంట్ 2026 బిరుదు అందుకోవడం గమనార్హం.
దుబాయ్‌లోని ట్రెసిండ్ స్టూడియో (Tresind Studio) 28వ స్థానం సంపాదించుకుంది. చెఫ్ హిమాంశు సైనీ నేతృత్వంలోని ఈ రెస్టారెంట్‌కు మధ్యప్రాచ్యంలోని ఉత్తమ రెస్టారెంట్ అవార్డు దక్కింది.
గతంలో ఈ లిస్టులో 2004లో మొదటి సారి ఒకే రెస్టారెంట్ చోటు దక్కించుకుంది. అది ఢిల్లీలోని బుఖారా రెస్టారెంట్. అయితే ఈసారి భారత్‌లోని రెండు రెస్టారెంట్లు ఒకేసారి చోటు సంపాదించడం చారిత్రక విశేషం.
