నదిని శుభ్రం చేసి పాపులర్ అయ్యాడు.. ఇప్పుడు రోగాల పాలైన బిట్టూ తబాహి!

నదిని శుభ్రం చేసి పాపులర్ అయ్యాడు.. ఇప్పుడు రోగాల పాలైన బిట్టూ తబాహి!

చేతిలో ఓ పార, ఓ తట్ట, చేతి కర్రలు, గ్లోవ్స్, బూట్లతో  ఎలాంటి అత్యాధునిక సామాగ్రి లేకుండా నదులను క్లీన్ చేసి స్వచ్ఛత గురించి చాటిచెప్పాలని ప్రయత్నిస్తున్న బిట్టు తబాహి గురించి తెలిసే ఉంటుంది.  మధ్యప్రదేశ్ లోని అజ్నార్ నదిని ఒక్కడే శుభ్రం చేసి ప్రపంచాన్ని ఆకర్శించిన బిట్టు అలియాస్ సురేశ్ సింగ్ చౌదరీ ఇప్పుడు ఫేమస్ పర్యావరణ వేత్త. మనోళ్లు వేస్తున్న చెత్తను క్లీన్ చేసి.. చెత్త మనస్తత్వాన్ని కడిగేయాలనుకున్న బిట్టు.. చివరికి తనే అనారోగ్యం పాలవడం చర్చనీయాంశంగా మారింది. 

పరిసరాలను, నదులను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి ఒక్కరికీ తమ బాధ్యత గుర్తెరిగేలా వినూత్నంగా ఒంటిచేతి ఉద్యమం చేస్తున్న బిట్టు.. అనారోగ్యానికి గురయ్యాడు. స్కిన్ ఎలర్జీస్ (దద్దుర్లు), బాడీ పెయిన్స్ (నొప్పులు)తో బాధపడుతున్నాడు. ముఖ్యంగా కాళ్లు చేతులకు వస్తున్న సమస్యలపై వీడియో పోస్ట్ చేసి.. మళ్లీ అలాగే తన కర్తవ్యానికి పూనుకున్నాడు. 

బిట్టు అనారోగ్యానికి గురికావడం సోషల్ నెటిజన్లకు బాధ కలిగించిన అంశం. బిట్టు షేర్ చేసిన వీడియోపై కామెంట్లు, సలహాలతో వైరల్ అవుతోంది. 

నెలల తరబడి నదుల క్లీనింగ్ లో గడిపిన తనకు.. ఫిజికల్ గా ఇబ్బందులు వస్తున్నాయని.. ముఖ్యంగా నొప్పులు, గోకుడు సమస్యలు ఒక్కోసారి నిద్ర పట్టనివ్వటంలేదని ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశాడు. 

కాళ్లు, చేతులకు చర్మ వ్యాధులు అంటుకున్నట్లు వీడియోలో గమనించవచ్చు. చర్మం లేకిపోవడం, ఇన్ఫెక్షన్ కు గురికావడం వంటి సమస్యలు వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. పరిశుభ్రతలో భాగంగా దురద, నొప్పులు తెచ్చుకున్నానని పోస్ట్ లో పేర్కొన్నాడు. 

ఎందుకు సమస్యలు..?

ఎక్కువ సేపు మురికి నీళ్లలో ఉండటం  వలన సూక్ష్మక్రిములు, ఫంగస్, బ్యాక్టీరియా అంటుకుని ఇన్ఫెక్షన్స్ కు దారి తీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. వీటితో పాటు ఇత ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని అంఉన్నారు. 

కనీస జాగ్రత్తలతో కష్టమే..

బిట్టు అత్యాధునిక సాధనాలతో కాకుండా.. కేవలం గ్లౌజులు, బూట్లతోనే నీళ్లలోకి దిగుతున్నాడు. దీని వలన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి సూక్ష్మ క్రిములు నేరుగా శరీరంలోకి చొచ్చుకుపోయి అనారోగ్యానికి గురిచేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. 

బిట్టు పరిస్థితిపై సోషల్ మీడియాలో చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. మురికి నీళ్లకు డైరెక్ట్ కాంటాక్ట్ కాకుండా చూసుకోవాలని చెబుతున్నారు. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వాడాలని సలహా ఇస్తున్నారు. అదే విధంగా హ్యాండ్ వాష్, జెర్మ్ ప్రొటెక్టివ్ సబ్బులు, జెల్స్ వెంట తీసుకళ్లాలని చెబుతున్నారు. నీళ్లల్లో దిగకుండా చెత్త తీసే పనిముట్లను వాడాల్సిందిగా సూచిస్తున్నారు. 

బిట్టూ విజ్ఞప్తి:

స్కిన్ సమస్యలతోనే మళ్లీ నీళ్లలోకి దిగుతున్న బిట్టు.. ఇండియన్స్ కు మెసేజ్ ఇస్తున్నాడు. అందరిలో మార్పు రావాలి.. మన పరిసరాలను మనమే కాపాడుకోవాలి.. అందుకోసం ఎవరికి వారు బాధ్యతగా చెత్తను, మురికిని నీటిలో కలపకుండా ఉండేలా మెలగాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వీడియో ద్వారా సందేశాన్ని పంపాడు. 

నీటిలో దిగితే చర్మ వ్యాధులు వస్తున్నాయంటే మన నదుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని కోరుతున్నాడు బిట్టు. మన చుట్టూ ఇంత మలినాలను, రోగాలను పెంచి పోషించుకుంటున్నాం.. ఇది అందరికీ ప్రమాదమే. మన భవిష్యత్ కోసం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే.. మనమే బాధ్యత తీసుకుంటే ఇండియాను క్లీన్ గా ఉంచుకోవచ్చునని బిట్టు చెబుతున్నాడు. 
 

బిట్టు విజ్ఞప్తిని అందరూ పాటించాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం.. మన ఇండియన్స్ ఎంత నెగ్లెక్ట్ గా ఉంటారో బిట్ట చేసిన పనిలోనుంచే తెలుసుకోవచ్చునని అంటున్నారు. నదిని క్లీన్ చేసిన నెల రోజులకే మళ్లీ మునుపటిలాగే ఛండాలంగా తయారు చేశారు.. చివరికి చెత్త కోసం ఏర్పాటు చేసిన డ్రమ్ములను కూడా ఎత్తుకెళ్లడం అంటే మనోళ్ల బాధ్యత ఏంటో అర్థమవుతుందని సెటైర్ వేస్తున్నారు.