శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భక్తులకు సౌకర్యాలను మరింత మెరుగు పరిచేలా.. ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు డిజిటల్ సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. మరికొన్ని రోజుల్లో మండలం-మకరవిళక్కు యాత్రా సీజన్ ప్రారంభం కానుండగా.. భక్తులకు అవసరమైన సేవలు, రియల్‌టైమ్ సమాచారం అందించేందుకు శబరి పోర్టల్, వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రారంభించింది.
గురువారం (2026 నవంబర్ 5) రెవెన్యూ మంత్రి ఏ.పి. అనిల్‌కుమార్ పథనంతిట్ట జిల్లా పరిపాలన శాఖ అభివృద్ధి చేసిన శబరి పోర్టల్, చాట్‌బాట్‌ను ప్రారంభించారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా యాత్రా సంబంధిత సేవలను సులభతరం చేయడం, వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం మెరుగుపరచడం లక్ష్యం ముందుకు సాగనున్నట్లు చెప్పారు.
ప్రత్యేక యాప్ డౌన్‌లోడ్ చేసుకోకుండానే ఈ పోర్టల్‌ను ఉపయోగించవచ్చు. దర్శనం, రవాణా, వసతి, ఆరోగ్య సేవలు, అత్యవసర సహాయం, పంబ, నీలక్కల్, సన్నిధానంలోని సౌకర్యాలు వంటి సమాచారం ఒకే చోట లభిస్తుందని తెలిపారు.
ముఖ్యమైన ఫీచర్లు:
తప్పిపోయిన వ్యక్తులు, మొబైల్ ఫోన్లు సహా పోయిన వస్తువుల గురించి ఫిర్యాదు చేసే సౌకర్యం ఉంటుంది. ఫిర్యాదులు ఆటోమేటిక్‌గా పోలీసు కంట్రోల్ రూమ్‌కు వెళ్తాయి. అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా వస్తాయి. ఫోటోలు కూడా అప్‌లోడ్ చేయవచ్చు.
తాగునీటి పాయింట్లు, టాయిలెట్లు, మెడికల్ సెంటర్లు, ఆసుపత్రులు, పోలీస్ సేవలు, పార్కింగ్, రెస్ట్ ఏరియాలు, ఏటీఎంలు వంటి లొకేషన్ ఆధారిత సమాచారం ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా సమీప సౌకర్యాలను తెలుసుకోవచ్చు.
దర్శన వెయిటింగ్ టైం, దర్శనం పూర్తి చేసుకున్న భక్తుల సంఖ్య, పూజా సమయాలు, పంబ త్రివేణి స్నాన ఘాట్‌లో నీటి మట్టం వంటి వివరాలు పొందుపర్చారు.
కెఎస్‌ఆర్‌టీసీ బస్సులు, చెంగన్నూర్, తిరువల్ల, కొట్టాయం రైల్వే స్టేషన్ల టైమింగ్స్ కూడా ఉంటాయి.
ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల వివరాలు, నేరుగా కాంటాక్ట్ చేసే సౌకర్యం ఉంటుంది.
పంబ, నీలక్కల్, సన్నిధానంలోని దుకాణాల్లో ధరల పర్యవేక్షణ ఉంటుంది. అధికారిక ధరలు అన్నిభాషల్లో ఉండేలా ఏర్పాటు చేశారు. చెక్ మై బిల్.. సౌకర్యం ద్వారా ఎక్కువ ధర వసూలు చేస్తే ఫిర్యాదు చేయవచ్చు.
పారిశుద్ధ్యం, టాయిలెట్లు, కెఎస్‌ఆర్‌టీసీ, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు సంబంధిత ఫిర్యాదులు చేయవచ్చు. అత్యవసర నంబర్లు (112, 1077, 108, 100, 101) నేరుగా యాక్సెస్ చేయవచ్చు.
అడ్మినిస్ట్రేటివ్ డ్యాష్‌బోర్డ్ ద్వారా వివిధ విభాగాల పనితీరు, సిబ్బంది నియోజనం, పారిశుద్ధ్య కార్యకలాపాలు రియల్‌టైమ్‌లో పర్యవేక్షించవచ్చు. వాతావరణం, ఉష్ణోగ్రత, రిజర్వాయర్ నీటి మట్టాలు, వన్యప్రాణి దాడులు, ప్రమాదాలు వంటి సమాచారం కూడా ఇంటిగ్రేట్ చేశారు.
పంబలో సమీక్ష సమావేశంలో అధ్యక్షత వహించిన మంత్రి అనిల్‌కుమార్ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, భక్తులకు సురక్షితమైన, ఇబ్బంది లేని యాత్ర కల్పించాలని ఆదేశించారు. పంబ నదిలో బట్టలు వదలకుండా అవగాహన కల్పించాలని, వదిలేసిన బట్టలను త్వరగా తొలగించే వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం నీలక్కల్‌లో కనీసం రెండు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని భాషల్లో ప్రకటనలు పెంచాలని, అత్యవసర సహాయం, తాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.
41 రోజుల మండలం యాత్రా సీజన్ నవంబర్ 17న ప్రారంభమవుతుంది. దీనిలో భాగంగా ఈసారి డిజిటల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడంతో భక్తుల ఇబ్బందులు తగ్గనున్నట్లు భావిస్తున్నారు.
