పోలింగ్‌తో పనేలేదు.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం

పోలింగ్‌తో పనేలేదు.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర అభ్యర్థులు ఎవరూ పోటీలో లేకపోవడంతో హర్దీప్ సింగ్ పూరి యూనానిమస్‎గా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి గురువారం (నవంబర్ 5) ప్రకటించారు. కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. 

మధ్యప్రదేశ్‎లో ఖాళీ అయిన రాజ్య సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 12న ఎన్నిక జరగనుండగా.. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 5 చివరి తేదీ. బీజేపీ తరుఫున కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 

స్క్రూటీనిలో సాంకేతిక లోపాల కారణంగా స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో హర్దీప్ సింగ్ పూరి ఒక్కరే పోటీలో నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి గురువారం (నవంబర్ 5)  హర్దీప్ సింగ్ పూరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. పూరి అందుబాటులో లేకపోవడంతో ఆయన తరుఫున బీజేపీ మధ్యప్రదేశ్ అధ్యక్షుడు హేమంత్ ఖండేల్వాల్ అసెంబ్లీ ప్రాంగణంలో రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఎన్నికల సర్టిఫికేట్‌ను అందుకున్నారు. 

2030, ఏప్రిల్ 2 వరకు హర్దీప్ సింగ్ పూరి ఈ పదవిలో కొనసాగనున్నారు. 2026, నవంబర్‎లో ఉత్తరప్రదేశ్ నుంచి పూరి రాజ్య సభ సభ్యత్వం ముగిసిన విషయం తెలిసిందే. యూపీ నుంచి బీజేపీ మరోసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ నుంచి పూరికి అవకాశం కల్పించింది. రాజ్య సభకు తిరిగి ఎన్నిక కావడంతో హర్దీప్ సింగ్ పూరి మంత్రి పదవికి ఎలాంటి ముప్పు లేదు.