పెళ్లి, సంసార జీవితం అనేది ఎంత బలహీనపడుతుందో అనడానికి ఇదొక ఉదాహరణ. రోజురోజుకు పెరుగుతున్న విడాకుల కేసులను తగ్గించేందుకు ఏకంగా ప్రభుత్వాలే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న చిన్న కారణాలతో, సిల్లీ ఫైట్ లతో విడిపోతున్న జంటలు ఎక్కువవుతున్న క్రమంలో గోవా ప్రభుత్వం, గోవా కాలేజీ ఆఫ్ హోమ్ సైన్స్ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఏంటా నిర్ణయం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యువతకు ఏం చెప్పాలనుకుంటున్నారో వివరంగా..
ఇటీవల కాలంలో మన దేశంలో పెళ్లి, సంసార జీవితం అనేది చాలా సిల్లీగా మారింది. చిన్న చిన్న కారణాలతో అనేక జంటలు విడాకులు కోరుకుంటున్నాయి. యువతులలో ఆర్థిక స్వావలంబన, స్వేచ్ఛ, కుటుంబ నేపథ్యం వంటి మారుతున్న సామాజిక పరిణామాలతో విడాకుల సంస్కృతి బాగా పెరిగిపోతున్న క్రమంలో గోవా కాలేజీ ఆఫ్ హోం సైన్స్ ఓ సరికొత్త కోర్సును ప్రవేశపెట్టింది.
పెళ్లికి ముందే సంసార జీవితం, జీవిత భాగస్వామి బాధ్యతలు, భార్యభర్తల మధ్య బంధాలపై యువతకు అవగాహన కల్పించేందుకు ‘‘మ్యారేజ్ రెడీనెస్’’ పేరుతో సర్టిఫికెట్ కోర్సును ప్రారంభిస్తోంది. ఈ కోర్సు డిసెంబర్ 2 నుంచి 17, 2026 వరకు నిర్వహిస్తారని కాలేజ్ ప్రిన్సిపాల్ మహేష్ పాయ్ ప్రకటించారు.
15 రోజుల కోర్సు ఇది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులతో పాటు పెళ్లికాని యువతీ యువకులకు కూడా ఇది అందుబాటులో ఉంటుందని పాయ్ చెప్పారు.పెళ్లికి సిద్ధపడటం అంటే కేవలం వివాహ వేడుకకు రెడీ అవడం మాత్రమే కాదని,మన గురించి, మన భాగస్వామి గురించి, పెళ్లి పట్ల నిబద్ధత గురించి, వైవాహిక జీవితంలో బాధ్యతలపై అవగాహన అవసరం అని చెబుతున్నారు కోర్సు నిర్వాహకులు. డేటింగ్ అర్థం, స్వీయ అవగాహన, పురుషత్వం,స్త్రీత్వం, పెళ్లి Vs వివాహం వంటి అంశాలు కోర్సులో ఉంటాయని బ్రోచర్ లో చెప్పడం చర్చనీయాంశమైంది.
ఈ కోర్సు ప్రారంభానికి కారణం కూడా ఉంది. రాష్ట్ర న్యాయ శాఖ గణాంకాల ప్రకారం, 2022 నుంచి 2025 మధ్య గోవా సివిల్ కోర్టులలో విడాకులకోసం 3వేలకు పైగా జంటలు దరఖాస్తు చేసుకోవడం ముఖ్య కారణం. విడాకులు తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివాహానికి ముందు కౌన్సెలింగ్ అమలు చేయాలని సీఎం ప్రమోద్ సావంత్ పనాజీలో జరిగిన ఓ ఈవెంట్ లో చెప్పిన తర్వాత ఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు గోవా కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు. మరోవిషయం ఏంటంటే ఆ కేసుల్లో కేవలం 2024లోనే 947 పిటిషన్లు ఉండటం గమనార్హం.
