లాస్ట్ మినిట్‌లో బీసీసీఐ బిగ్ డెసిషన్.. ఢిల్లీ నుంచి వైజాగ్‌కు మారిన భారత్–శ్రీలంక తొలి వన్డే

లాస్ట్ మినిట్‌లో బీసీసీఐ బిగ్ డెసిషన్.. ఢిల్లీ నుంచి వైజాగ్‌కు మారిన భారత్–శ్రీలంక తొలి వన్డే

న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా 2026, డిసెంబర్ 13న భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి వన్డే వేదిక మారింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, స్టేడియం పునరుద్ధరణ పనుల నేపథ్యంలో తొలి వన్డే వేదిక ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్‎లోని విశాఖపట్నానికి షిఫ్ట్ అయ్యింది. గురువారం (నవంబర్ 5) ఈ విషయాన్ని  బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన చేసింది. 

‘‘2026, డిసెంబర్ 13న భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి వన్డే వేదికను ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి మార్చారు. వాతావరణం వల్ల అంతరాయం కలిగే అవకాశం, అలాగే స్టేడియంలో ప్రతిపాదిత పునరుద్ధరణ పనుల దృష్ట్యా ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ చేసిన అభ్యర్థన మేరకు ఈ వేదిక మార్పు జరిగింది. ఈ మ్యాచ్ 2026, డిసెంబర్ 13న విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో జరుగనుంది” అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా, 2026 డిసెంబర్‎లో ఇండియా, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచుల వన్డే సిరీస్ జరగనుంది. వేదిక మార్పు అనంతరం తొలి వన్డే విశాఖపట్నంలో జరగనుండగా.. రెండో వన్డేకు బెంగళూరు, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం మూడో చివరి వన్డేకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 క్యాలెండర్ ఇయర్‎లో టీమిండియాకు ఇదే చివరి వన్డే సిరీస్. 

ఇండియా, శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూల్

  • 1వ వన్డే    డిసెంబర్ 13,    విశాఖపట్నం
  • 2వ వన్డే    డిసెంబర్ 16,    బెంగళూరు
  • 3వ వన్డే    డిసెంబర్ 19,   అహ్మదాబాద్