నవంబర్ 13న ప్రళయం రాబోతుందా.. : 66 ఏళ్ల నాటి జ్యోతిష్యంపై ఎందుకీ చర్చ..!

నవంబర్ 13న ప్రళయం రాబోతుందా.. : 66 ఏళ్ల నాటి జ్యోతిష్యంపై ఎందుకీ చర్చ..!

జస్ట్ నాలుగంటే 4 రోజుల్లో భూమి అంతం కాబోతోందా? అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీలు సృష్టించిన మానవజాతికి చివరి నిమిషాలు దగ్గరపడుతున్నాయా? పదుల ఏళ్లుగా ఉన్న మానవ ప్రయాణానికి భూమిపై నూకలు చెల్లాయా? నవంబర్ 13 చుట్టూ తిరుగుతున్న అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నలు ఇవన్నీ. దాదాపు 66 ఏళ్ల కిందట ఈ ప్రళయానికి సంబంధించి చేసిన జ్యోతిష్య అంచనాలు ఎంత వరకూ నిజం అవుతాయి అనే ప్రశ్నలు ఇప్పుడు డూమ్స్ డే గురించి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. భూమి అంతం గురించి ఆందోళన పడుతున్న వారు, అలాగే దానికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది ఫ్రెండ్స్..

భూమి అంతం గురించి, ప్రళయం గురించి గతంలో అనేక జోస్యాలు చెప్పిన వారు ఉన్నారు. కానీ ఏకంగా ప్రపంచ ప్రసిద్ధ సైన్స్ జర్నల్ ‘సైన్స్’ లోనే ఓ సైన్టిఫిక్ స్టోరీ ప్రచురితమై, నవంబర్ 13, 2026వ తేదీన ఈ ప్రపంచం అంతమైపోతుందని కచ్చితమైన తేదీని ప్రకటించడం 66 ఏళ్ల కిందట సంచలనం సృష్టించింది. సరిగ్గా ఆ భయపెట్టే తేదీ రానే వచ్చింది. మరి ఈ నవంబర్ 13న నిజంగానే ప్రళయం వస్తుందా? అసలు ఆ అంచనా వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నవంబర్ 13, 2026.. నిజంగానే ప్రళయం వస్తుందా?

1960లో ‘సైన్స్’ పత్రిక ఒక అసాధారణమైన శీర్షికతో ఆర్టికల్ ప్రచురించింది. "డూమ్స్ డే: ఫ్రైడే, 13 నవంబర్, ఏ.డి. 2026"  పేరుతో వచ్చిన ఆ స్టోరీ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలికిపడేలా చేసింది. ఆ భవిష్యత్ తేదీన మానవ జనాభా అనంతమైన సంఖ్యకు చేరుకుని, భూమిపై జనాభా భారాన్ని మోయలేక మానవాళి అంతమైపోతుందని ఆ ఆర్టికల్ చెప్పింది. అయితే మనం ఇప్పుడు ఆ తేదీకి అతి సమీపంలో ఉన్నాము. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని.. నవంబర్ 13 ఒక సాధారణ రోజు లాగే గడిచిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ శాస్త్రవేత్తలు ఊహించినట్లుగా ఎలాంటి ప్రళయం రావడం లేదని వాధిస్తున్నారు.

►ALSO READ | జ్యోతిష్యం : సింహరాశిలోకి కుజుడు.. కార్తీకమాసంలో ఆరు రాశుల వారికి మహాయోగం

ఆస్ట్రియన్-అమెరికన్ ప్రొఫెసర్, సైబర్‌నెటిక్స్ నిపుణుడు అయిన హైంజ్ వాన్ ఫోర్స్టర్.. ఆయన విద్యార్థులు ప్యాట్రిసియా ఎం. మోరా, లారెన్స్ డబ్ల్యూ. అమిట్ ఈ ఆర్టికల్‌ను అప్పట్లో రూపొందించారు. ఇతర జంతువుల జనాభా లాగా కాకుండా, మనుషులు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతారని వారు వాదించారు. మనుషులకు ఆలోచనా శక్తి, సంభాషించే సామర్థ్యం, సమస్యలను పరిష్కరించుకునే గుణం ఉండటం వల్ల జనాభా కేవలం ఊహించనంత వేగంగా పెరుగుతుందని వారు నిరూపించారు. గడచిన 2వేల సంవత్సరాల జనాభా లెక్కలను విశ్లేషించి.. 2026 నాటికి మనుషులు ఆకలితో కాకుండా, జనసాంద్రత పెరిగిపోయి మనుషులు చచ్చిపోతారని వారు హెచ్చరించారు.

తగ్గిన జనన రేటు.. తప్పిన ప్రమాదం

అప్పట్లో శాస్త్రవేత్తల ఈ కథనం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. టైమ్, న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రముఖ పత్రికలలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 1960ల నుంచి 1980ల వరకు ఈ "డూమ్స్ డే ఈక్వేషన్" ఎకాలజీ, డెమోగ్రఫీ పాఠ్యపుస్తకాల్లో ప్రముఖంగా ప్రస్తావించబడింది. అయితే,1993 నాటికి ఈ అంచనాలు తప్పడం ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల వేగం నెమ్మదించింది. వాస్తవానికి ఆ శాస్త్రవేత్తలు తాము చేసిన విశ్లేషణ ద్వారా ప్రపంచానికి ఒక హెచ్చరిక చేశారు. మానవాళి వెంటనే మేల్కొని ప్రపంచ జనన రేటును సగానికి తగ్గిస్తే తప్ప ఈ విపత్తును ఆపలేమని చెప్పారు. సరిగ్గా ప్రపంచం అదే బాటలో నడిచి జనన రేటును తగ్గించడంతో ఆ ప్రమాదం తప్పింది.

శాస్త్రవేత్తల 'మ్యాజిక్' ట్రిక్:

ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ ఆర్టికల్ రాసిన హైంజ్ వాన్ ఫోర్స్టర్ తన జీవితంలో ఒకప్పుడు స్టేజ్ మ్యాజిషియన్‌గా పనిచేశారు. మ్యాజిక్‌లో ఎలాగైతే ముందుగా ఆశ్చర్యపరిచి, చివరికి అసలు విషయాన్ని బయటపెడతారో.. అదే సూత్రాన్ని ఆయన సైన్స్‌లో ప్రయోగించారు. ప్రజల్లో గ్లోబల్ జనాభా పెరుగుదలపై తీవ్రమైన చైతన్యం తెప్పించడం కోసమే ఆయన ఈ అద్భుతమైన 'స్టేజ్‌క్రాఫ్ట్' టెక్నిక్‌ను ఉపయోగించారు. మొత్తానికి ఆ రోజు చెప్పిన భయాలు నిజం కాకపోయినా.. పర్యావరణం, జనాభా నియంత్రణ ఎంత ముఖ్యమో ప్రపంచానికి చాటిచెప్పడంలో ఆ శాస్త్రవేత్తలు పూర్తిగా విజయం సాధించారు. సో 4 రోజుల్లో జీవితం అంతం అయిపోతుంది, భూమిపై మనుషులే ఉండరు ప్రళయం వచ్చేస్తుందనే భయాలు అక్కర్లేదని నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు.