నూతన సంవత్సరం సంవత్ 2083ను పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. దీపావళి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ తొలుత భారీ లాభాలతో ప్రారంభమైంది.
ఒక దశలో 400 పాయింట్లకు పైగా పెరిగి 81,406 స్థాయికి చేరుకుంది. అయితే ఆ తర్వాత లాభాలు ఆవిరయ్యాయి. చివరకు 28.62 పాయింట్లు నష్టపోయి 80,999.40 వద్ద స్థిరపడింది.మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ప్రారంభంలో 79.15 పాయింట్లు పెరిగి 25,109.40 స్థాయికి చేరుకుంది. కానీ చివరకు 43.95 పాయింట్లు నష్టపోయి 24,986.40 వద్ద ముగిసింది.దీంతో ముహూరత్ ట్రేడింగ్‌లో వరుసగా తొమ్మిదేళ్ల పాటు కొనసాగిన మార్కెట్ల విజయ పరంపరకు బ్రేక్ పడింది.
లాభపడిన షేర్లు ఇవే..
సెన్సెక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో సన్ ఫార్మా అత్యధికంగా 2.96 శాతం లాభపడింది. ఆ తర్వాత టాటా స్టీల్, మారుతీ, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎటర్నల్, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్, హిందుస్థాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఐటీసీ, టైటాన్, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
నష్టపోయిన స్టాక్స్ ఇవే..
మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) షేరు అత్యధికంగా 0.92 శాతం నష్టపోయింది. ఇండిగో, ట్రెంట్, ఇన్ఫోసిస్, భారతి ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా నష్టాల్లో ముగిశాయి.
ముహూరత్ ట్రేడింగ్ ప్రత్యేకత ఏమిటి?
దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలు నిర్వహించే ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను ముహూరత్ ట్రేడింగ్ అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి కొత్త ఆర్థిక సంవత్సరానికి ప్రారంభ సూచికగా భావిస్తారు. ఈ శుభ ముహూర్తంలో ట్రేడింగ్ చేయడం వల్ల సంపద, ఆర్థికాభివృద్ధి కలుగుతాయని చాలామంది ఇన్వెస్టర్లు విశ్వసిస్తారు. సాధారణ రోజుల్లో ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు మార్కెట్లు పనిచేస్తాయి. కానీ ముహూరత్ ట్రేడింగ్ మాత్రం పరిమిత సమయం పాటు మాత్రమే నిర్వహిస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ ట్రేడింగ్ జరగడం వల్ల మార్కెట్లలో ఒడిదొడుకులు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు ముందుగానే హెచ్చరించారు.
