అద్దెకు వ్యవసాయ యంత్ర పరికరాలు... రాష్ట్రవ్యాప్తంగా 360 కస్టమర్ హైరింగ్ సెంటర్లు మంజూరు

అద్దెకు వ్యవసాయ యంత్ర పరికరాలు... రాష్ట్రవ్యాప్తంగా 360 కస్టమర్ హైరింగ్ సెంటర్లు మంజూరు
  • ఒక్కో యూనిట్ లో 37 రకాల ఇంప్లిమెంట్స్​ 
  • యూనిట్​కాస్ట్​ రూ. 50 లక్షలు..  సబ్సిడీ రూ. 20 లక్షలు
  • ఎఫ్ పీవోలు, ఎస్ హెచ్ జీలు, ప్యాక్స్ లకే ఛాన్స్  
  • ఫామ్​ మెకనైజేషన్​కు మరింత ఊతం

మంచిర్యాల, వెలుగు: అద్దెకు యంత్ర పరికరాలను ఇస్తూ వ్యవసాయ యాంత్రీకరణకు ఊతమిచ్చే చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. రాష్ర్టీయ కృషి వికాస్​ యోజన (ఆర్​కేవీవై)లో భాగంగా సబ్​- మిషన్​ ఆన్​ అగ్రికల్చర్​ మెకనైజేషన్​ (ఎస్​ఎంఏఎం) కింద కొత్తగా కస్టమ్​ హైరింగ్​ సెంటర్ల(సీహెచ్​సీ)లను శాంక్షన్​ చేసింది. రాష్ర్టవ్యాప్తంగా హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలకు 360 సీహెచ్​సీలు మంజూరయ్యాయి. 

వ్యవసాయ యాంత్రీకరణ పరిధిని విస్తరించడం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం, సాగులో వేగం పెంచడం, ఖర్చులను తగ్గించడమే సర్కారు లక్ష్యం. ఇప్పటికే రాష్ర్టంలోని పలుచోట్ల సీహెచ్​సీలు సక్సెస్​ఫుల్​గా రన్​ అవుతున్నాయి. మార్కెట్​ రేట్ల కంటే తక్కువ ధరలకే యంత్ర పరికరాలను రెంట్​కు ఇస్తూ  రైతులకు అండగా నిలుస్తున్నాయి. 

ఎఫ్​పీవోలు, ఎస్​హెచ్​జీలు, ప్యాక్స్​లకే ఛాన్స్

ఫార్మర్​ ప్రొడ్యూసర్స్​ ఆర్గనైజేషన్స్​​(ఎఫ్​పీవో), సెల్ఫ్​ హెల్ప్​ గ్రూపులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పాక్స్​)లకు మాత్రమే సీహెచ్​సీలను కేటాయించింది. యూనిట్​ కాస్ట్​ రూ.50 లక్షలు కాగా, ఇందులో 40 శాతం లేదా, గరిష్ఠంగా రూ.20 లక్షల సబ్సిడీ లభిస్తుంది. కిసాన్​ డ్రోన్​ సీహెచ్​సీలకు ప్రాథమిక, అనుబంధ ఖర్చులో రూ.5లక్షలు లేదా 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. ఇందుకోసం 2026-–27 ఆర్థిక సంవత్సరంలో రూ.69.36 కోట్ల బడ్జెట్​ను ప్రభుత్వం కేటాయించింది. 

కనీసం మూడు సంవత్సరాలు కంటిన్యూగా పనిచేస్తూ, పొదుపుతో పాటు బ్యాంకు లావాదేవీలు సక్రమంగా నిర్వహిస్తున్న సంఘాలకు సీహెచ్​సీల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది. గత మూడేండ్ల కాలంలో ఇతర స్కీమ్​ల కింద సీహెచ్​సీలను పొంది ఉండరాదు. దీనికి నోడల్​ ఏజెన్సీ అయిన హాకా యంత్ర పరికరాల రేట్లను నిర్ణయిస్తుంది. జిల్లా లెవల్​ సెలక్షన్​ కమిటీకి కలెక్టర్​ చైర్మన్, జిల్లా అగ్రికల్చర్​ ఆఫీసర్​ కన్వీనర్ కాగా, డాట్​ సెంటర్​ లేదా కేవీకే సైంటిస్ట్, లీడ్​ బ్యాంక్​ జిల్లా మేనేజర్, జిల్లా కో ఆపరేటివ్​ ఆఫీసర్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్, సంఘాల నుంచి ఒక నామినేటెడ్​ మెంబర్, ఆదర్శ రైతు సభ్యులుగా వ్యవహరిస్తారు.  

ఏ జిల్లాకు ఎన్ని..

రాష్ర్టవ్యాప్తంగా 360 సీహెచ్​సీలకు గాను ఆదిలాబాద్​ 8, భద్రాద్రి కొత్తగూడెం 10, హనుమకొండ 10, జయశంకర్​ భూపాలపల్లి 8, జోగులాంబ గద్వాల 9, జగిత్యాల 11, జనగామ 9, కుమ్రం భీమ్​ ఆసిఫాబాద్​కు 14 సెంటర్లు మంజూరయ్యాయి. కామారెడ్డి 10, కరీంనగర్​ 10, ఖమ్మం 20, మహబూబాబాద్​ , మహబూబ్​నగర్​ 18, మంచిర్యాల 9, మెదక్​ 18, మేడ్చల్​ 3, ములుగు 12, నాగర్​కర్నూల్​ 15, నల్గొండ 17, నారాయణపేట్​ 20 సీహెచ్​సీలు రానున్నాయి. 

నిర్మల్​ 5, నిజామాబాద్​ 16, పెద్దపల్లి 10, రాజన్న సిరిసిల్ల 9, రంగారెడ్డి 5, సంగారెడ్డి 10 సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. సిద్దిపేట 13, సూర్యాపేట 14, వికారాబాద్​ 11, వనపర్తి 8, వరంగల్​ 10, యాదాద్రి భువనగిరి 12 సెంటర్లను ప్రభుత్వం శాంక్షన్​ చేసింది. 

యంత్ర పరికరాలు ఇవే.... 

సీహెచ్​సీలలో దాదాపు 37 రకాల యంత్ర పరికరాల అందుబాటులో ఉంటాయి. పవర్​ టిల్లర్, వీడర్, డిస్క్​ ఫ్లౌ, కల్టివేటర్, లెవలింగ్​బ్లేడ్, రొటోవేటర్, రోటో పడ్లర్, రివర్సబుల్​ ఎంబీ ఫ్లౌ, సబ్​ సాయిలర్, బండ్​ఫార్మర్​ వంటి ల్యాండ్​ డెవలప్​మెంట్, టిల్లేజ్ఎక్విప్​మెంట్లు, సీడ్​ కమ్​ ఫర్టిలైజర్​ డ్రిల్, మల్టీ క్రాప్​ప్లాంటర్, రైజ్డ్​బెడ్​ప్లాంటర్, పోస్ట్​ హోల్​ డిగ్గర్, ప్లాస్టిక్​మల్చ్​లేయింగ్ మిషన్, ఫర్టిలైజర్​ బ్రాడ్​కాస్టర్, రిడ్జ్​ ఫరో ప్లాంటర్​వంటి సోయింగ్​, ప్లాంటింగ్, ఫర్టిగేషన్​ఎక్విప్​మెంట్స్, ఇంటర్​ కల్టివేషన్​ పరికరాలైన గ్రాస్, వీడ్​ స్లాషర్, పవర్​ వీడర్, ప్లాంట్​ప్రొటెక్షన్​కు వినియోగించే స్ప్రేయర్లు, కిసాన్​ డ్రోన్లు, హార్వెస్టింగ్​యంత్రాలు, టర్మెరిక్​ బాయిలర్, పాలిషర్, ప్యాడీ డ్రయర్​, టెలిస్కోపిక్​ హార్వెస్టింగ్​పోల్స్​ రెంట్ లభిస్తాయి.