వ్యవసాయానికి గోల్డ్ లోన్స్ తీసుకునే రైతులకు షాక్.. కొత్త రూల్స్ తెచ్చిన RBI

వ్యవసాయానికి గోల్డ్ లోన్స్ తీసుకునే రైతులకు షాక్.. కొత్త రూల్స్ తెచ్చిన RBI

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ నిబంధనలలో కీలక మార్పులు చేస్తూ నవంబర్ 5న తాజా ముసాయిదా విడుదల చేసింది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలు.. అందులోనూ బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే వ్యవసాయ గోల్డ్ లోన్లపై RBI రూల్స్ మరింత కఠినతరం చేసింది.

గతంలో రైతులు బంగారాన్ని కుదువపెట్టి సులువుగా అగ్రికల్చర్ లోన్ పొందేవారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం.. కేవలం బంగారం విలువను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని లోన్ మంజూరు చేయడానికి వీలుండదు. వ్యవసాయ కార్యకలాపాల వాస్తవ అవసరాలు, భూమి వివరాలు, పండించే పంటలు వంటి అంశాలను బ్యాంకులు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఒక ముఖ్యమైన స్పష్టతను ఇస్తూ.. బంగారం ఆభరణాలను తాకట్టు పెట్టినంత మాత్రాన ఆ అగ్రి లోన్స్ PSL ప్రయోజనాలకు అనర్హత కాదని రిజర్వు బ్యాంక్ స్పష్టం చేసింది.

అయితే అగ్రి గోల్డ్ లోన్ రూల్స్ కఠినంగా మారడంతో బ్యాంకుల పరిశీలన విధానం పూర్తిగా మారనుంది. ఇకపై రైతులు సాగు చేసే భూమి ఎక్కడ ఉంది? ఏ పంటలు సాగు చేస్తున్నారు? వంటి పూర్తి వివరాలతో పాటు.. తీసుకున్న అప్పును సక్రమంగా వాడుతున్నారా లేదా అని పరిశీలించడానికి బ్యాంక్ అధికారులు నేరుగా పొలాలను సందర్శించి రికార్డులు నిర్వహించడం తప్పనిసరి చేశారు. ఒకవేళ భూమి రికార్డులు లేని కౌలు రైతులు లేదా భూమిలేని వ్యవసాయ కూలీలు అయితే.. వారి అర్హతను నిరూపించేందుకు ప్రత్యామ్నాయ ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ALSO READ : అన్నా అని పిలిచినోళ్లనే ఉద్యోగం నుంచే తీసేయాలా

ఈ కొత్త నిబంధనల ద్వారా అగ్రికల్చర్ లోన్స్ పేరుతో జరిగే అవకతవకలకు, నిధుల మళ్లింపునకు చెక్ పెట్టాలని ఆర్‌బీఐ భావిస్తోంది. బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకునే వెసులుబాటు రైతులకు గతంలో మాదిరిగానే కొనసాగినప్పటికీ.. డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్ ప్రక్రియ మాత్రం ఇకపై మరింత కఠినంగా ఉండనుంది. దీనివల్ల నిజమైన రైతులకు మాత్రమే బ్యాంకింగ్ రంగం నుంచి సకాలంలో సాయం అందే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.