E20 పెట్రోల్‎లో 31.2 శాతం ఇథనాల్.. బిగ్ బాంబ్ పేల్చిన కర్నాటక సర్కార్

E20 పెట్రోల్‎లో 31.2 శాతం ఇథనాల్.. బిగ్ బాంబ్ పేల్చిన కర్నాటక సర్కార్

బెంగళూర్: పర్యావరణ పరిరక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన E20 ఇంధనంపై కర్నాటక సర్కార్ బిగ్ బాంబ్ పేల్చింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విక్రయించే E20 ఇంధనంలో ఇథనాల్ మిశ్రమం నిర్దేశిత 20 శాతానికి మించి ఉన్నట్లు కర్నాటక ప్రభుత్వం సంచలన విషయం బయటపెట్టింది. E20 పెట్రోల్‎లో ఇథనాల్ శాతం దాదాపు 31.2 శాతం వరకు ఉన్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం E20 ఇంధనంలో 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ మిశ్రమం కలపాలి.

కానీ ప్రభుత్వ ప్రమాణాలకు మించి అధికంగా ఇథనాల్ కలపడం వల్ల వాహనదారులు ఆర్థిక నష్టాలకు గురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అధిక ఇథనాల్ వల్ల మైలేజీ తగ్గి వాహనదారులకు నిర్వహణ ఖర్చులు పెరిగాయని పేర్కొంది. వాహనదారులకు నష్టపరిహారం ఇవ్వాలని కేంద్రం ప్రభుత్వాన్ని కర్నాటక సర్కార్ డిమాండ్ చేసింది. 

వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోన్న నేపథ్యంలో E20 పెట్రోల్‎పై కర్నాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, షెల్ వంటి ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీల నుంచి మొత్తం 63 నమూనాలను సేకరించింది. ఈ 63 నమూనాలను చమురు మార్కెటింగ్ కంపెనీల ప్రయోగశాలలకు పంపి అందులోని ఇథనాల్ పరిమాణం వివరాలను ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.

అయితే, ఇథనాల్ శాతంపై చమురు కంపెనీలు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వానికి అనుమానం వచ్చి శాంపిల్స్‎ను స్వతంత్ర పరీక్షల కోసం ప్రైవేట్ ప్రయోగశాలలకు పంపింది. బెంగళూరు అర్బన్‌తో సహా ఏడు జిల్లాల నుంచి సేకరించిన నమూనాల పరీక్షల్లో ఇథనాల్ పరిమాణం నిర్దేశిత 20 శాతానికి మించి ఉన్నట్లు తేలింది. 

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి స్పీడ్ పెట్రోల్‌లో 26.5 శాతం, నయారా పెట్రోల్‌లో 26.1 శాతం, షెల్ పెట్రోల్‌లో 25.5 శాతం ఇథనాల్ ఉన్నట్లు వెల్లడైంది. రెండు బీపీసీఎల్ నమూనాలలో 24.2 శాతం, 22.6 శాతం ఇథనాల్ ఉండగా, మరో హెచ్‌పీసీఎల్ నమూనాలో 22.4 శాతం, ఇంకో ఐఓసీఎల్ నమూనాలో 20.8 శాతం ఇథనాల్ ఉన్నట్లు తేలింది.

E20 ఇంధన నాణ్యత, నిర్దేశించిన ఇథనాల్ మిశ్రమానికి సంబంధించిన పరిమితిని పాటించడం, అలాగే తగ్గిన మైలేజీ, పెరిగిన వాహన నిర్వహణ ఖర్చుల రూపంలో వినియోగదారులపై పడే ప్రభావంపై ఈ పరిశోధన ఫలితాలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

ఇది E20 ఇంధనం కాదు: కర్నాటక సర్కార్

E20 ఇంధనంలో ఇథనాల్ శాతం నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉండటంపై కర్నాటక ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది E20 ఇంధనం కాదని ఆరోపించింది. పెట్రోల్‌లో అధికంగా ఇథనాల్ కలపడం వల్ల ఇంధన సామర్థ్యం తగ్గడం, వాహన నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి నష్టాలకు వాహనదారులకు పరిహారం చెల్లించేందుకు కేంద్రం ఒక నష్టపరిహార నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.

అధిక ఇథనాల్ వల్ల మైలేజీ 10 శాతం తగ్గితే వాహనదారులు ఏటా రూ. 62 వేల కోట్ల నష్టాన్ని చవిచూడవచ్చని.. అలాగే వాహన సర్వీసింగ్ ఖర్చుల కింద అదనంగా మరో రూ. 39 వేల కోట్లు పెరగవచ్చని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. వినియోగదారులకు సరఫరా చేస్తున్న ఇంధనంలో అసలు ఇథనాల్ మిశ్రమ శాతాన్ని భారత ప్రభుత్వం బహిరంగంగా స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. 

ఇప్పటికే E20 ఇంధనంపై వాహనదారుల నుంచి దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో ఈ20 పెట్రోల్‎లో ఇథనాల్ స్థాయికి మించి ఉందన్న కర్నాటక ప్రభుత్వ ఆరోపణలతో E20 పెట్రోల్ దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు దారి తీసింది.