హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ సంస్థలు, డ్యామ్ సేఫ్టీ నిపుణుల సూచనల ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న మూడు బ్యారేజీలను సురక్షితంగా తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారులతో గురువారం (నవంబర్ 5) సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా ప్రాజెక్టును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద నీళ్లున్నప్పటికీ వాటిని లిఫ్ట్ చేయడం లేదనే ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. అక్కడ కనిపిస్తున్న నీటిని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాంకేతికంగా లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.
మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన నీళ్లు ఎల్లంపల్లికి చేరాలంటే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లను మూసివేయాల్సి ఉంటుందని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అయితే, నిర్మాణ లోపాలున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లను తెరిచే ఉంచాలని ఎన్డీఎస్ఏ హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు. దిగువ గోదావరి నీరు వృథాగా పోకుండా దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా నీటిని లిఫ్ట్ చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. దీంతో ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఆయకట్టుకు సాగునీరు, తాగునీటిని అందించామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో దేవాదుల ద్వారా ఏడాదికి సగటున 9.57 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తే.. ఈ మూడేండ్లలో సగటున 18.13 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసినట్లు చెప్పారు. గతంతో పోలిస్తే 89 శాతం అధికంగా గోదావరి జలాలను వాడుకున్నట్లు వివరించారు. అక్టోబర్‌నాటికి దేవాదుల ద్వారా 16.71 టీఎంసీలు, సీతారామ ద్వారా 8.10 టీఎంసీలు లిఫ్ట్ చేసి 24.81 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకున్నామని వివరించారు.
ఈ సమావేశంలో మూడు బ్యారేజీల పునరుద్ధరణకు రూపొందించిన ప్రణాళికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణం పెరిగిందని, వరి దిగుబడిలో దేశంలోనే రికార్డు సాధించామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే మేడిగడ్డ కుంగిపోయిందని, బ్యారేజీల కుంగిపోవడానికి దారితీసిన కారణాలను వివరించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే కరువు పరిస్థితుల్లోనూ ఇబ్బందులు ఉండేవి కావని, ప్రాణహిత నీటిని తక్కువ ఖర్చుతో ఎల్లంపల్లికి తీసుకువచ్చే అవకాశం ఉండేదని అన్నారు.
మూడు బ్యారేజీల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. బ్యారేజీల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. అవసరమైన అనుమతులను త్వరితగతిన పొందేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న తర్వాత మూడు బ్యారేజీల పరిస్థితిపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయించినట్లు అధికారులు వివరించారు. జాతీయ స్థాయి నిపుణులు, కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సంస్థల సహకారంతో అవసరమైన పరిశోధనలు పూర్తి చేసినట్లు తెలిపారు. పునరుద్ధరణకు సంబంధించిన ప్రాథమిక ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని వివరించారు.
మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులకు దాదాపు రూ.4,193 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. నిర్మాణ లోపాలకు సంబంధించిన మరమ్మతుల వ్యయాన్ని నిర్మాణ సంస్థలే భరించేలా, అదనపు పనుల వ్యయాన్ని ప్రభుత్వం భరించేలా ప్రతిపాదించినట్లు వివరించారు. పనుల్లో జాప్యం జరగకుండా అన్ని ప్రక్రియలను సమాంతరంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
పునరుద్ధరణ పనులకు సంబంధించిన తుది అనుమతులను ఈ నెలాఖరులోగా పొందేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఏడాది చివరిలోగా పనులు ప్రారంభించాలన్నారు. బ్యారేజీల నీటి వినియోగ సామర్థ్యాన్ని పునరుద్ధరించే పనులతో పాటు రక్షణ పనులను రెండు దశలుగా విభజించుకోవాలని చెప్పారు బ్యారేజీల భద్రతకు సంబంధించిన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, నిర్మాణ సంస్థల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు.
