నల్లగొండ జిల్లాలో కారుణ్య నియామకాల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వైద్యశాఖ అధికారులపై వేటు పడింది. శాలిగౌరారం మెడికల్ ఆఫీసర్,సూపరింటెండెంట్ లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ 2026 నవంబర్ 5న ఉత్తర్వులు జారీ చేశారు.
శాలిగౌరారం మెడికల్ ఆఫీసర్ సూర్యశిల్ప, సూపరింటెండెంట్ జితేందర్ రెడ్డిలఉ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన కలెక్టర్ వారిని సస్పెండ్ చేశారు. సెక్షన్ క్లర్క్ కృష్ణమోహన్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హాలియాకు బదిలీ చేశారు. సీసీ జూనియర్ అసిస్టెంట్ రంజిత్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఐటీ నగర్ (మాల్)కు బదిలీచేశారు. సీనియర్ అసిస్టెంట్ రాకేష్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కొండమల్లేపల్లికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నిష్పక్షపాతంగా విచారణ జరిగేందుకే వారిని బదిలీ చేశామని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.
ఇటీవల నల్లగొండ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీల పేరుతో జిల్లా వైద్యశాఖ అధికారుల హల్‌చల్ చేశారు. తనిఖీల్లో భాగంగా జిల్లా ఇన్‌చార్జి అధికారి పేరుతో సీసీ రంజిత్ అక్రమాలకు పాల్పడ్డారంటూ మరికొన్ని ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది.
గతంలో పనిచేసిన డీఎంహెచ్‌ఓ పుట్ట శ్రీనివాస్ పాత్రపైపోలీసులు ఆరా తీస్తున్నారు. పుట్ట శ్రీనివాస్ కార్యాలయ వ్యవహారాలన్నీ సీసీ రంజిత్ చక్కబెట్టేవారని వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది.
