చేతిలో స్మార్ట్‌ఫోన్.. కళ్ల ముందు యాక్షన్ గేమ్స్.. గెలవాలనే పోటీ.. ప్రత్యర్థులను అంతమొందించాలనే లక్ష్యం! పిల్లల ప్రపంచంలోకి వేగంగా చొచ్చుకుపోతున్న పబ్జీ వంటి ఆన్లైన్ గేమ్స్ వారి ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? హింసాత్మక గేమ్స్‌లో కనిపించే దృశ్యాలు పిల్లల ఆలోచనా విధానాన్ని, కోపాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తాయా? హర్యానాలోని పంచకులలో ఆరేళ్ల బాలికపై పాఠశాలలో జరిగిన దాడి ఘటన ఈ ప్రశ్నలను మరోసారి తెరపైకి తెచ్చింది. చిన్నారుల చేతుల్లో స్మార్ట్ఫోన్లు, ఆన్లైన్ గేమ్స్ పెరుగుతున్న క్రమంలో పేరెంట్స్, స్కూల్ నిర్వాహకులు అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.
ఇటీవల హర్యానాలోని పంచకులలో ఆరేళ్ల బాలికపై పాఠశాలలో జరిగిన దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఆరేళ్ల బాలికపై మూడో తరగతి విద్యార్థి క్రూరంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయాలతో ఆస్పత్రి పాలైంది. ఈ ఘటనతో తరగతి గదిలో బాలికపైదాడి, ఎవరూ చూడకపోవడం, విద్యార్థి ప్రవర్తనా తీరు, పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, టీచర్ల పర్యవేక్షణపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ప్రిన్సిపాల్ ఆఫీసు నుంచే సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నప్పటికీ బాలికపై దాడి ఎలా గుర్తించలేకపోయారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
బాధిత బాలిక మామ ఫజిల్ తెలిపిన వివరాల ప్రకారం.. దాడి చేసిన మూడో తరగతి విద్యార్థికి PUBG సహా హింసాత్మక వీడియో గేమ్స్ ఆడే అలవాటు ఉంది. ఆ బాలుడి తండ్రి కూడా ఈ విషయాన్ని అంగీకరించినట్లు ఫజిల్ వెల్లడించారు. అయితే వీడియో గేమ్స్ కారణంగానే ఈ ఘటన జరిగిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
దాడికి ముందు బాలుడు బాధితురాలిని 'పిచ్చిది' అని పిలిచాడని, ఆమె అభ్యంతరం చెప్పి ఫిర్యాదు చేస్తాననడంతో తన తండ్రిపై అంతస్తులో ఉన్నారని చెప్పి వెంట తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం బాలిక గాయాలతో అపస్మారక స్థితిలో కనిపించింది. అయితే ఆమెను గుర్తించినప్పుడు నిందితుడిగా ఉన్నర విద్యార్థే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు మామ తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి బాలిక కోలుకుంటోంది. ఈ ఘటనపై స్కూల్, విద్యార్థిపై వేర్వేరుగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మరోవైపు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని జూనియర్ బేసిక్ ట్రైనింగ్ టీచర్ సిమ్రన్‌జీత్ కౌర్, పూజా రాణిలను హర్యానా విద్యాశాఖ సస్పెండ్ చేసింది. ఈ ఘటనతో పాఠశాలల్లో సీసీటీవీ వ్యవస్థల నిర్వహణతో పాటు విద్యార్థులపై నిరంతర పర్యవేక్షణ ఎంత అవసరమో మరోసారి చర్చకు దారితీసింది.
