హైదరాబాద్ దాహం తీర్చే హిమాయత్ సాగర్ గేట్ల నుంచి నీళ్ల లీకేజీకి తాత్కాలిక పరిష్కారం

హైదరాబాద్ దాహం తీర్చే హిమాయత్ సాగర్ గేట్ల నుంచి నీళ్ల లీకేజీకి తాత్కాలిక పరిష్కారం

హైదరాబాద్ దాహార్తి తీర్చే హిమాయత్ సాగర్ గేట్ల నుంచి నీళ్లు లీకవుతుండటం ఆందోళన కలిగించే అంశం. నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని లీకవుతున్న నీటిని తిరిగి జలాశయంలోకి మళ్లిస్తున్నారు జలమండలి అధికారులు. 2026 నవంబర్ 5వ తేదీన మోటార్లతో నీటి పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు.

ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడనుండటంతో  జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. నీటి ప్రతి చుక్కను పొదుపు చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్ వద్ద గేట్ల నుంచి బయటకు లీకవుతున్న నీటిని వృథాగా పోనివ్వకుండా భారీ మోటార్లను ఏర్పాటు చేశారు. లీకేజీ ద్వారా బయటకు వస్తున్న నీటిని మోటార్ల సహాయంతో తిరిగి హిమాయత్ సాగర్ జలాశయంలోకే పంపిస్తున్నారు.

జలమండలి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. నీటి వనరులను కాపాడుకోవడంతో పాటు, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడమే లక్ష్యంగా అధికారులు ఈ ప్రయత్నం చేస్తున్నారు.