తెలంగాణలో 10 రోజులు ఎండలు..ఆ తర్వాత చలే...

తెలంగాణలో  10 రోజులు ఎండలు..ఆ తర్వాత చలే...

హైదరాబాద్: తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మరోసారి మారనున్నాయి. ఇటీవల రెండు తుఫాన్ల ప్రభావంతో రాష్ట్రంలోని ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడగా.. ఇకపై క్రమంగా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. రేపటి(నవంబర్ 6) నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని తెలిపింది. మరోవైపు నవంబర్ నెలలోనూ పెద్దగా వర్షాలు కురిసే సూచనలు లేవని వెల్లడించింది.

మరో పది రోజులు వర్షాలు లేనట్లే!

రాష్ట్రంలో వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయి. వచ్చే పది రోజుల పాటు తెలంగాణలో చెప్పుకోదగ్గ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రెండు తుఫాన్ల ప్రభావంతో ఇప్పటివరకు ప్రధానంగా ఈశాన్య జిల్లాల్లో మాత్రమే వర్షాలు కురిశాయి. వాటి ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి చల్లని వాతావరణం నెలకొంది. అయితే తుఫాన్ల ప్రభావం తగ్గడంతో తిరిగి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.

సాధారణంగా నవంబర్ నెల నుంచి చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది. అయితే ఈసారి మాత్రం చలి అంతగా ఉండకపోవచ్చని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నవంబర్ రెండో వారం నుంచి చలి తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇటీవల తుఫాన్ల కారణంగా తగ్గిన ఉష్ణోగ్రతలు తిరిగి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రేపటి(నవంబర్ 7) నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. వర్షాలు లేకపోవడం, పొడి వాతావరణం కొనసాగడం కూడా ఉష్ణోగ్రతల పెరుగుదలకు దోహదపడవచ్చు.

ALSO READ : AIతో ముసలి వయస్సులో ఆరోగ్యంపై పరిశోధనలు

మొత్తంగా చూస్తే.. తెలంగాణలో రానున్న రోజుల్లో వర్షాల ప్రభావం తగ్గి పొడి వాతావరణం కొనసాగనుంది. పగటి వేడి పెరుగుతుండగా, రాత్రి వేళల్లో చలి తీవ్రత కూడా పెద్దగా ఉండకపోవచ్చన్న అంచనాలు ప్రజల్లో ఆసక్తి రేపుతున్నాయి.