విద్య, వైద్యంపై స్పెషల్ ఫోకస్ ..చెన్నూర్ ను రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా: మంత్రి వివేక్

విద్య, వైద్యంపై స్పెషల్ ఫోకస్ ..చెన్నూర్ ను రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా: మంత్రి వివేక్

మంచిర్యాల: విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నా మంత్రి వివేక్ వెంకటస్వామి. వైద్య సేవల కోసం మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. చెన్నూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో మంత్రి  వివేక్ వెంకటస్వామి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సుమారు రూ.1.60 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కోటపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎస్సీ హాస్టల్ నూతన భవన నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థినుల సౌకర్యార్థం అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

 కోటపల్లి మండలంలో కూడా విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తేనే వారు ఆరోగ్యంగా ఉంటూ బాగా చదువుకోగలుగుతారని అన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నామని తెలిపారు.అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. కోటపల్లి మండలంలోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని, ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

గత పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులతో పాటు మూడు లక్షల పెన్షన్లు అందించినట్లు వివరించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందుకోసం రూ.70 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రజలంతా నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంటలకు నీరు అందించడం లేదంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కొన్ని ప్రాజెక్టుల్లో నిర్మాణపరమైన సమస్యలు తలెత్తడం వల్లే ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించే ప్రతి ప్రాజెక్టును పటిష్టంగా నిర్మిస్తున్నామని తెలిపారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మించి ఉంటే ఈ కరువు పరిస్థితులు వచ్చేవి కావని అభిప్రాయపడ్డారు.