కోలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఏలిన దళపతి విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి రాజకీయాల్లో తనదైన ముద్రతో దూసుకెళ్తున్నారు. హీరోగా కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న ఆయన.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమవుతారని అంతా భావించారు. ముఖ్యంగా'జన నాయగన్' తన చివరి సినిమా అని ప్రకటించడంతో అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. కానీ ఇప్పుడు అనూహ్యమైన వార్త ఒకటి తెరపైకి వచ్చింది. విజయ్ మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
అయితే ఇది సినిమా కోసం కాదు.. తమిళనాడు ప్రభుత్వం రూపొందించనున్న ఓ ప్రత్యేక ప్రచార ప్రకటన కోసం అని సమాచారం. అంతేకాదు, ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించబోతున్నది స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కావడం ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతోంది. విజయ్ ఈ ప్రకటన చిత్రీకరణ కోసం ఇప్పటికే రెండు రోజుల సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. ఇది త్వరలోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ప్రకటన ఏ అంశంపై రూపొందించనున్నారు? ఇందులో విజయ్ పాత్ర ఎలా ఉండబోతోంది? అనే విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే. ఈ ప్రకటనను సాధారణ టీవీ ప్రకటనలా కాకుండా, భారీ స్థాయిలో రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు కూడా దీనిని ప్రదర్శించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
అయితే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విజయ్ మళ్లీ తెరపై కనిపిస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆయన సినిమా రీఎంట్రీ కాకపోయినా, అభిమానులకు మాత్రం చిన్నపాటి పండగే అని చెప్పొచ్చు .దళపతి సినిమాలకు దూరమైనా.. కెమెరాకు మాత్రం పూర్తిగా దూరం కాలేదన్నమాట అని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
