డాక్టర్ను ఇంటికి పిలిపించి లక్షలు దోచేసిన కేసులో మత్తు వదలరా సినిమా నటి అరెస్ట్ !

డాక్టర్ను ఇంటికి పిలిపించి లక్షలు దోచేసిన కేసులో మత్తు వదలరా సినిమా నటి అరెస్ట్ !

మలయాళ సినీ పరిశ్రమలో నటి అతుల్య చంద్ర అరెస్ట్‌ కలకలం రేపింది. తెలుగులో మత్తు వదలరా సినిమా పార్ట్-1లో మైరా పాత్రలో నటించిన అతుల్య చంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. కొచ్చిలో ఓ డాక్టర్ను ఇంటికి పిలిపించి.. దాడి చేసి, అతనికి చెందిన విలువైన వస్తువులను దోచుకున్నారనే ఆరోపణలతో అతుల్య చంద్ర సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి వెలుగులోకి వస్తున్న వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

కొచ్చిలోని ఎసెన్ స్ప్రింగ్‌డేల్ అనే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ఒక ఫ్లాట్‌లో సోమవారం (నవంబర్ 2, 2026) ఒకరికి హెల్త్ బాలేదని, ఎమర్జెన్సీ అని చెప్పి అతుల్య చంద్ర, నటుడు-నిర్మాత బిబిన్ పెరుంబిల్లి, మరికొందరు వైద్యుడిని పిలిపించుకున్నారు. ఉదయం 6.30 గంటల సమయంలో సదరు డాక్టర్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. అపార్ట్ మెంట్ ఫ్లాట్లో దాదాపు 12 మంది ఉన్నారని వైద్యుడు చెప్పాడు. తనకు పరిచయం ఉన్న వ్యక్తులే పిలవడంతో ఆయన అక్కడికి వెళ్లినట్లు సమాచారం.

సుమారు 12 మంది ఉండటాన్ని చూసి వైద్యుడు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత కొందరు వ్యక్తులు అతనిని చుట్టుముట్టారు. అపార్ట్‌మెంట్‌లో ఉన్న కొందరు వ్యక్తులు తమ బంధువుకు మత్తు పదార్థాలు ఇచ్చి, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వైద్యుడిపై ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణలను వైద్యుడు ఖండించడంతో అతనిని కొట్టి దాడి చేశారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు తనపై దాడి చేశారని, కుర్చీతో కొట్టారని, గదిలో నిర్బంధించి బెదిరించారని వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

►ALSO READ | రజనీకాంత్ అన్నయ్యకు తీవ్ర గాయాలు.. హుటాహుటిన బెంగళూరు చేరుకున్న తలైవా!

దాడి సమయంలో తనకు చెందిన రెండు మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను తీసుకున్నారని వైద్యుడు ఆరోపించారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.3.25 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతుల్య చంద్ర మలయాళ సినీ పరిశ్రమలో నటిగా గుర్తింపు పొందారు. నటనతో పాటు న్యాయవాద వృత్తితోనూ ఆమెకు సంబంధం ఉంది. పలు దక్షిణాది చిత్రాల్లో నటించిన ఆమె పేరు ఇప్పుడు ఈ అరెస్ట్ వ్యవహారంతో వార్తల్లో నిలిచింది.