ఏపీలో హై అలర్ట్.. ఎయిర్ పోర్టుల్లో ఎబోలా స్క్రీనింగ్ టెస్టులు..

ఏపీలో హై అలర్ట్.. ఎయిర్ పోర్టుల్లో ఎబోలా స్క్రీనింగ్ టెస్టులు..

ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఎబోలా వైరస్ భయం వెంటాడుతోంది. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తయినట్లు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు అధికారులు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు చర్యలు చేపడుతున్నారు.

ఏపీలోని తిరుపతి, విశాఖపట్నం విజయవాడ, ఎయిర్ పోర్టులలో వైద్య పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఐదు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలు సిద్దం చేసినట్లు తెలిపారు అధికారులు. వీటిలో మొత్తం 46 పడకలు, 3వేల 288 పిపిఈ కిట్లు 104 నమూనా సేకరణ కిట్లు ఐదు అంబులెన్స్ లు సిద్దం చేసినట్లు వెల్లడించారు.

ఎబోలా వైరస్ సోకిన వ్యక్తుల్లో తొలుత తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయని... ఆ తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. వ్యాధి తీవ్రత పెరిగితే కొన్ని సందర్భాల్లో అంతర్గత, బాహ్య రక్తస్రావం కూడా సంభవించవచ్చని తెలిపారు అధికారులు.

అయితే ఎబోలా వైరస్ సాధారణ జలుబు, ఫ్లూ మాదిరిగా గాలి ద్వారా వ్యాపించదని... వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తుల రక్తం, ఇతర శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ఏర్పడినప్పుడు వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంటుందని తెలిపారు అధికారులు. ఎబోలా లక్షణాలు బయటపడేందుకు వైరస్ సోకిన తర్వాత రెండు నుంచి 21 రోజుల వరకు సమయం పట్టవచ్చని తెలిపారు అధికారులు.

ఈ క్రమంలో ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు అధికారులు.