ఇండియాకు వలస వచ్చిన పాకిస్థానీయులు, శ్రీలంక తమిళులు, టిబెటన్లు, మైనారిటీ శరణార్థులకు కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్, వీసా నిబంధనల నుంచి భారీ వెసులుబాటు కల్పించింది. ఇమిగ్రేషన్, ఫారినర్స్ సవరణ ఉత్తర్వులను గెజిట్‌లో ప్రచురించింది. ఈ సరికొత్త సవరణల ద్వారా భారత్‌లో నివసిస్తున్న విదేశీయులకు డాక్యుమెంట్ల రెన్యూవల్ కష్టాల నుంచి రిలీఫ్ లభించింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం.. 2009 డిసెంబర్ 31 లేదా అంతకుముందు శాశ్వత నివాస ఉద్దేశంతో భారత్‌కు వచ్చిన పాకిస్థానీయులు.. పాకిస్థాన్ జారీ చేసిన కంప్యూటరైజ్డ్ జాతీయ గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల తమ పాస్‌పోర్ట్‌లను రెన్యూవల్ చేసుకోలేకపోతే, వాటిని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే విభజన తర్వాత పాకిస్థాన్‌కు వలస వెళ్లి.. ఆ తర్వాత 2009 నాటికి కేరళలో స్థిరపడిన కొన్ని ముస్లిం వర్గాల పురుషులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. అయితే వారు పాక్‌లో వివాహం చేసుకోకపోవడం, ఆస్తులు కలిగి ఉండకపోవడం వంటి నిబంధనలు వర్తిస్తాయి.
ఇక అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లకు చెందిన.. హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ వర్గాల ప్రజలు 2024 డిసెంబర్ 31 నాటికి లేదా అంతకుముందు చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు లేకుండా భారత్‌లోకి ప్రవేశించినప్పటికీ వారికి మినహాయింపు లభించింది. అలాగే 2015 జనవరి 9కి ముందు భారతదేశంలో ఆశ్రయం పొందిన రిజిస్టర్డ్ శ్రీలంక తమిళులకు, అలాగే నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం జారీ చేసిన అనుమతులతో ప్రవేశించి నమోదు చేసుకున్న టిబెటన్ జాతీయులకు కూడా ఈ వెసులుబాటు కల్పించారు.
ALSO READ : తరుణ్ తేజ్ పాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు..
భారత్, నేపాల్, భూటాన్ దేశాల మధ్య రాకపోకలు సాగించే పౌరుల ప్రయాణ నిబంధనలను కూడా ఈ సవరణ ఉత్తర్వులు అప్‌డేట్ చేశాయి. ఈ దేశాల పౌరులు తమ దేశాల మధ్య ప్రయాణించేటప్పుడు పాస్‌పోర్ట్‌కు బదులుగా వీసా మాన్యువల్‌లో పేర్కొన్న ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించవచ్చు. అయితే చైనా, హాంకాంగ్, పాకిస్థాన్ తదితర ప్రాంతాల నుంచి ప్రయాణించే నేపాల్, భూటాన్ పౌరులు మాత్రం తప్పనిసరిగా పాస్‌పోర్ట్, వీసా కలిగి ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
