రియల్ ఎస్టేట్‌లో ఫస్ట్ టైం భారీ ఆఫర్స్: బట్టలు, బంగారం షాపులోళ్లు కూడా ఇన్ని ఇవ్వటం లేదే..!

రియల్ ఎస్టేట్‌లో ఫస్ట్ టైం భారీ ఆఫర్స్: బట్టలు, బంగారం షాపులోళ్లు కూడా ఇన్ని ఇవ్వటం లేదే..!

దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాలతో పాటు రియల్ ఎస్టేట్ మార్కెట్‌లోనూ సంబరాలు అంబరాన్ని తాకాలి. ఈసారినగరంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. బిల్డర్లు కార్లు, బంగారం, ఐఫోన్ల నుంచి ఏకంగా 'బై వన్ గెట్ వన్' ఆఫర్ల వరకు ఎన్నెన్నో క్రేజీ ఆఫర్లతో ముందుకు వచ్చాయి. బంగారం, బట్టలు షాపులోళ్ల కంటే ఎక్కువ ఆఫర్లతో రియల్టర్లు పండుగ సంతోషాన్ని రెట్టింపు చేసేస్తున్నారు హైదరాబాద్ నగరంలో. 

ఆకర్షణీయమైన ఆఫర్ల సునామీ.. 
హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు రియల్టర్లు వినూత్న మార్గాలను ఎంచుకున్నారు. యాప్రాల్ పరిసర ప్రాంతాల్లోని ఓ ప్రాజెక్ట్‌లో ఏకంగా రూ. 10 లక్షల విలువైన కారును బహుమతిగా ఇస్తుండగా.. నారపల్లి ప్రాంతంలోని మరో ప్రాజెక్ట్‌లో రూ. 52 లక్షల ప్రారంభ ధరతో ఉన్న 2 BHK ఫ్లాట్ల కొనుగోలుపై 10 గ్రాముల గోల్డ్ కాయిన్, రిఫరల్స్‌పై 100 గ్రాముల వెండి నాణేలు ఆఫర్ చేస్తున్నారు. వీటితో పాటు దుబాయ్ ఎయిర్ టికెట్లు, కొత్త ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, లక్కీ డ్రా ద్వారా మరో ప్రాపర్టీని గెలుచుకునే అదృష్టం వంటి భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నారు.

ధరలు తగ్గించకుండా గిఫ్ట్స్ ఆఫర్..
బిల్డర్లు నేరుగా అపార్ట్‌మెంట్ల ధరలను తగ్గించడానికి ఇష్టపడటం లేదు. ప్రాజెక్ట్‌ల బేసిక్ ధరలను అలాగే ఉంచుతూ.. విజిబుల్ రివార్డ్స్‌ను జోడిస్తున్నారు. ఉదాహరణకు రూ. కోటి విలువైన ఫ్లాట్‌పై రూ.2 లక్షల విలువైన ఒక కేజీ వెండిని బహుమతిగా ఇచ్చినా.. అది ఆ ప్రాపర్టీ విలువలో కేవలం 2 శాతమే అవుతుంది. ఇలాంటి ప్రమోషనల్ ఖర్చులు డెవలపర్ల మార్జిన్లపై పెద్దగా ప్రభావం చూపవు. కేవలం ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచడానికి, ఎక్సైట్మెంట్ కలిగించేందుకు పండుగ వేళ కొత్త ప్రయోగం చేస్తున్నారు బిల్డర్లు. 

ఇల్లు కొనాలనే చిరకాల కోరికను తీర్చుకోవాలని హైదరాబాద్ నగరంలో ప్రయత్నిస్తున్న లక్షల మందికి పండుగ వేళ కొత్త కాన్ఫిడెన్స్ నింపుతున్నాయి ఈ క్రేజీ ఆఫర్స్. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఖరీదైన గిఫ్ట్స్, గోల్డ్, సిల్వర్, కార్లు, బైకులు రావటంతో ప్రజలు సైతం పండుగ సమయంలోనే కొత్త ప్రాపర్టీ బుక్కింగ్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.