గ్లోబల్ మార్కెట్లలో భారీ క్రాష్.. మన మార్కెట్లను లాభాల్లో నడిపిస్తున్న అంశాలు ఇవే!

గ్లోబల్ మార్కెట్లలో భారీ క్రాష్.. మన మార్కెట్లను లాభాల్లో నడిపిస్తున్న అంశాలు ఇవే!

నిన్న భారీ లాభాలతో ఇన్వెస్టర్లపై డబ్బు వర్షం కురిపించిన గ్లోబల్ మార్కెట్లు.. శుక్రవారం రోజున ఊహించని విధంగా నష్టాలను మిగిల్చాయి ఇన్వెస్టర్లకు. ప్రధానంగా అమెరికా మార్కె్ట్లలో భారీ పతనం టెక్ ఇన్వెస్టర్లకు నష్టాలను తెచ్చిపెట్టింది. చిప్ తయారీ దిగ్గజం ఎన్వీడియో స్టాక్ ఏకంగా 440 బిలియన్ డాలర్ల విలువను ఒక్కరోజులోనే కోల్పోయింది. దీనికి తోడు టెస్లా, స్పేస్ ఎక్స్ సహా ఇతర పెద్ద టెక్ కంపెనీల షేర్లు పతనం అయ్యాయి. దీంతో 2020 తర్వాత న్యూయార్క్ స్టాక్ మార్కెట్లు చెత్త రోజున నమోదు చేశాయి. ఇదే క్రమంలో సౌత్ కొరియా స్టాక్ మార్కెట్ సూచీ కోస్పీ కూడా 8 శాతం వరకూ క్రాష్ కావటంతో ఏఐ చిప్ తయారీ కంపెనీల షేర్లు ఊహించని పతనాన్ని చూస్తున్నాయి. 

ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్లు మాత్రం తమ భలమైన పనితీరును కొనసాగిస్తున్నాయి శుక్రవారం రోజున కూడా. దీంతో ఉదయం 10.52 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 481 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా.. నిఫ్టీ సూచీ 90 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. అయితే నిఫ్టీ బ్యాంక్ సూచీ 31 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 750 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో జపాన్ స్టాక్ మార్కెట్లు సైతం నష్టాలతో ముందుకు సాగుతూ 2022 జనవరి నాటి నష్టాలను అధిగమించాయి. అలాగే తైవాన్ కేంద్రంగా ఉన్న సెమీకండక్టర్ తయారీ కంపెనీల షేర్లు కూడా నష్టాలను మూటకట్టుకున్నాయి. అయితే చైనా, హాంకాంగ్ మార్కెట్లు మాత్రం కొంత మెరుగ్గా తక్కువ నష్టాలతో ముందుకు సాగుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఏఐ, ఫ్యూచెర్ టెక్నాలజీలకు చిప్స్ తయారు చేసే కంపెనీల షేర్లలో కనిపించిన భారీ కుదుపుకు ఇన్వెస్టర్లు లాభాలు బుక్ చేసుకోవటం కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. అయితే భారత్ లో ఎక్కువగా టెక్ కంపెనీలు సర్వీస్ ఓరియెంటేషన్ బేస్ మీద నడుస్తుండటం వల్లనే ఏఐ టెక్ స్టాక్స్ క్రాష్ ప్రభావం సెన్సెక్స్, నిఫ్టీలపై కనిపించలేదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇన్వెస్టర్లు నిన్నమెున్నటి భారీ లాభాలను బుక్ చేసుకోవచ్చని వీకెండ్ రోజున వారు చెబుతున్నారు.