ఆర్టీసీ మెట్రో కంబైన్డ్ పాస్‌పై రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరల్లో భారీ తగ్గింపు ప్రకటించింది. రూ.8,500 ఉన్న నెలవారీ పాస్ ధర రూ.4,000కు తగ్గించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుకగా ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను భారీగా తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలకు ప్రయాణ ఖర్చుల భారం తగ్గించి, ప్రజా రవాణా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం రూ.400గా ఉన్న రోజు వారి ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.275కు తగ్గించినట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో రూ.200 మెట్రో ప్రయాణానికి, రూ.75 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించినట్లు తెలిపారు. ఈ పాస్ ద్వారా రోజుకు 4 సింగిల్ జర్నీలకు అనుమతి ఉంటుందని వివరించారు.
అదేవిధంగా ప్రస్తుతం రూ.8,500గా ఉన్న నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను ఏకంగా రూ.4,000కు తగ్గించినట్లు తెలిపారు. ఇందులో రూ.3,000 మెట్రో ప్రయాణానికి, రూ.1,000 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ పాస్ ద్వారా నెలలో గరిష్టంగా 50 రౌండ్ ట్రిప్పులకు అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఈ ధరల తగ్గింపుతో నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ వినియోగదారులకు రూ.4,500 ఆదా అవుతుందని, సాధారణ ఉమ్మడి పాస్ వినియోగదారులకు రూ.125 ఆదా అవుతుందని మంత్రి తెలిపారు.
నవంబర్ 8 నుంచి కొత్త ధరలు అమల్లోకి..
ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపు ధరలు నవంబర్ 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత సంస్థలను ప్రభుత్వం ఆదేశించినట్లు వెల్లడించారు. ప్రజల సంక్షేమం, ప్రయాణికుల ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు ఎంతో ఊరటనిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
