భార్యతో సహా.. అత్త, బామ్మర్దులు, వాళ్ల భార్యలు.. ఇలా ఏడుగురిని చంపేసిన భర్త !

భార్యతో సహా.. అత్త, బామ్మర్దులు, వాళ్ల భార్యలు.. ఇలా ఏడుగురిని చంపేసిన భర్త !

బెంగళూరు: భార్యాభర్త మధ్య గొడవలు ఏడుగురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. భార్యతో ఉన్న విభేదాల కారణంగా ఆమెతో పాటు ఆమె కుటుంబానికి చెందిన మరో ఆరుగురిని భర్త హత్య చేసిన షాకింగ్ ఘటన కర్నాటకలో వెలుగుచూసింది. ఈ హత్యలకు పాల్పడిన క్యాబ్ డ్రైవర్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యల చేశాక ఏడు మృతదేహాలను కారులో తరలించి వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఈ ఘటన కర్నాటకలో హాట్ టాపిక్గా మారింది. నిందితుడిని ఇందుశేఖర్ అలియాస్ శేఖర్‌గా గుర్తించారు. శేఖర్ భార్య సునీత, అత్త రూపావతి, బావమరుదులు శివకుమార్, శంకర్, వారి భార్యలు దివ్య, నళిని, ఏడేళ్ల బాలుడు పునీత్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

శేఖర్, సునీతలకు సుమారు 20 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ముఖ్యంగా సునీత తన పుట్టింటి వారితో సన్నిహితంగా ఉండటం, వారు ఆమెకు మద్దతుగా నిలవడం నిందితుడికి అస్సలు నచ్చలేదు. భార్యాభర్త మధ్య రాజీ కుదిర్చేందుకు ఇరు కుటుంబాలు ప్రయత్నించాయి. అయినప్పటికీ శేఖర్ ప్రవర్తనలో మార్పు రాకపోగా భార్యపై, ఆమె కుటుంబంపై పగ పెంచుకున్నాడు.

అందరినీ చంపేయాలని నిర్ణయించుకుని రాజాజీనగర్‌లోని తన ఇంట్లో శేఖర్ ఏడుగురినీ చంపేశాడు. ఒక్కొక్కరినీ తెలివిగా ఇంటికి పిలిపించుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. తొలుత అతని భార్య సునీతను హత్య చేశాడు. ఆ తర్వాత ఇతర కుటుంబ సభ్యులను వేర్వేరు సమయాల్లో ఇంటికి పిలిపించి దాడి చేసి చంపేశాడు. ఈ హత్యలకు గ్రైండింగ్ స్టోన్‌ను ఉపయోగించినట్లు ప్రాథమిక సమాచారం.

అందరినీ చంపేశాక మృతదేహాలను తన కారులో తీసుకెళ్లి నంది హిల్స్ పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో పడేసినట్లు నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. ఇంట్లో రక్తపు మరకలు కనిపించకుండా రసాయనాలతో శుభ్రం చేసినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో హత్యలకు ఉపయోగించిన వస్తువుతో పాటు కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శేఖర్ బావమరిది భార్య నళిని కనిపించకుండా పోవడంతో ఆమె తల్లి శ్రీరాంపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు శేఖర్‌ను విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో.. పోలీసులకు అతని తీరుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

లోతుగా విచారించడంతో ఏడుగురి హత్యల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నంది హిల్స్ ప్రాంతంలో గాలింపు చేపట్టి ఏడేళ్ల బాలుడు పునీత్ మృతదేహాన్ని గుర్తించారు. మిగిలిన ఆరుగురి మృతదేహాల కోసం ప్రత్యేక బృందాలతో అన్వేషణ కొనసాగిస్తున్నారు.