ప్రపంచ దేశాల్లో మధుమేహం లేదా డయాబెటిస్ అత్యధికంగా విస్తరించి ఉన్న దేశంగా భారత్ చరిత్రను సృష్టించడంతో పాటు ‘ప్రపంచ మధుమేహ రాజధాని భారత్’ అనే అపఖ్యాతిని మూటగట్టుకుంటున్నది. ‘ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్’ వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 40 ఏండ్లు దాటిన ప్రతి 8 మందిలో ఒక్కరు మధుమేహంతో బాధపడుతున్నారని తేలింది.
డయాబెటిస్ రుగ్మత ఓ నిశ్శబ్ద విధ్వంసంగా రూపాంతరం చెందుతున్నది. భారత్‌లో అత్యధికంగా 100 మిలియన్లకు పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2015 వివరాల ప్రకారం 60 శాతం మంది పిల్లల్లో షుగర్ లెవల్స్ సాధారణం కన్నా అతిగా ఉన్నట్లు తేలింది.
ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రుగ్మత వల్ల మానవాళిపై అత్యంత సామాజిక ఆర్థిక భారం పడుతున్నది. భారత్‌లో గోవా(26.4%), పుదుచ్చేరి(26.3%), కేరళ (25.5%) రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధికంగా మధుమేహం ఉన్నట్లు తేలగా, యూపీలో అత్యల్పంగా 4.8 శాతం మాత్రమే ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందువల్లనే గోవా/కేరళ రాష్ట్రాలను ‘భారత మధుమేహ రాజధానులు’గా పిలుస్తున్నాం. కేవలం ఢిల్లీ మహానగరంలోనే 29.8 లక్షల మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. దేశ మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో దాదాపు మూడోవంతు పట్టణాల్లోనే ఉన్నారని, గ్రామీణుల్లో డయాబెటిస్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
అవరోధాల్ని ఛేదిద్దాం
మధుమేహ వ్యాధి వ్యాప్తి పెరగడం, ప్రమాదకరంగా మారడంతో దాని పట్ల ప్రజల్లో తగిన అవగాహనను కల్పించడానికి 1992 నుంచి ప్రతి ఏటా నవంబర్ మాసాన్ని ‘ప్రపంచ మధుమేహ మాసం (వరల్డ్ డయాబెటిక్ మంత్)’గా పాటించుట ఆనవాయితీగా మారింది.
కృత్రిమ ఇన్సులిన్‌ను కనుగొన్న ‘ఫ్రెడ్రిక్ బాంటింగ్’ గౌరవార్థం వారి జన్మదినం సందర్భంగా 14 నవంబర్ రోజున ‘ప్రపంచ డయాబెటిస్ డే’పాటిస్తున్నాం. మధుమేహ వ్యాధికి గల కారణాలు, వ్యాధి లక్షణాలు, నియంత్రణ మార్గాలు, చికిత్స విధానాల పట్ల అవగాహన కలిగిస్తూ మధుమేహ నిశ్శబ్ద విధ్వంసాన్ని ఆపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ [email protected]
- రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
