ట్రంప్ పాలనలో భారత్‌కు జరిగిన మేలెంత ?

ట్రంప్ పాలనలో భారత్‌కు జరిగిన మేలెంత ?

అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికలలో అధ్యక్షుడు  డొనాల్డ్  ట్రంప్‌కు  పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన రిపబ్లికన్ పార్టీ  పార్లమెంటుపై నియంత్రణ కోల్పోయింది. సహజంగానే ఇది అధ్యక్షుడు ట్రంప్‌కు ఒక పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించాలి. కానీ వాస్తవం ఏమిటంటే 2001 నుంచి చాలామంది అమెరికా అధ్యక్షులు తమ హయాంలో జరిగిన  మధ్యంతర ఎన్నికలలో ఓటమిపాలయ్యారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ ఒబామా కూడా ఆయన పదవీకాలంలో ఉండగా దాదాపు ట్రంప్ అంత ఘోరంగానే ఓడిపోయారు.

మధ్యంతర ఎన్నికలలో అమెరికా అధ్యక్షులు ఓడిపోవడం 1776 నుంచి ఒక ఆనవాయితీగా జరుగుతోంది. యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగం ఉద్దేశపూర్వకంగా  మూడు  పవర్‌‌  పిల్లర్స్​ను సృష్టించింది. ఆ 3 పిల్లర్స్​లో ఒకటి  అధ్యక్షుడు, రెండు  న్యాయవ్యవస్థ, మూడోది  పార్లమెంటు.  ఎవరూ అధికారపూర్వకంగా  అతి శక్తిమంతులు కాకుండా ఉండేందుకు ఈ మూడు స్తంభాల మధ్య అధికారాలు విభజించారు.  అమెరికా ప్రతి అధ్యక్షుడు  పాలనాపరంగా న్యాయవ్యవస్థ,  పార్లమెంటుతో  కలిసి పనిచేయాలి. అదే విధంగా అధ్యక్షుడు లేకుండా అమెరికా పార్లమెంటు కూడా ఏమీ చేయలేదు.

అయితే,  డొనాల్డ్‌  ట్రంప్  పార్లమెంటుపై  నియంత్రణ  కోల్పోయినప్పటికీ,  అమెరికా పార్లమెంటు తనకు నచ్చిన ఏ చట్టాన్నైనా  అధ్యక్షుడి సమ్మతి లేకుండా  ఆమోదించగలదని  దీని అర్థం కాదు. అమెరికా అధ్యక్షుడు పార్లమెంటు ఆమోదించిన ఏ చట్టాన్నైనా వీటో చేయగలరు.  అధ్యక్షుడు చేసిన  ఆ వీటోను పార్లమెంటు అధిగమించాలనుకుంటే, అదే చట్టాన్ని మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది. 

ఇప్పటికీ  ట్రంప్ ప్రత్యర్థులకు మూడింట రెండు వంతుల మెజారిటీ లేదు.  కాబట్టి, క్లుప్తంగా చెప్పాలంటే, ఏ చట్టాన్నైనా ఆమోదింపజేసుకోవాలంటే పార్లమెంటు అధ్యక్షుడితో  కలిసి పనిచేయాల్సి ఉంటుంది.  అంటే ట్రంప్‌కు పవర్‌‌  తక్కువైనా, ఆయనకు అవసరమైన  మేరకు అథారిటీ ప్రాబల్యం ఉంది.

భారతదేశంపై ట్రంప్ ప్రతికూల ప్రభావం
2025లో డొనాల్డ్‌ ట్రంప్  రెండోసారి అమెరికా అధ్యక్షుడైనప్పుడు.. ఆయన  భారతదేశం పట్ల అత్యంత స్నేహపూర్వకంగా ఉంటారని భారత్‌తో పాటు ప్రపంచదేశాలలో  భారీ అంచనాలు ఉండేవి. కానీ, విచిత్రంగా ట్రంప్  యూఎస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత భారతదేశం పట్ల శత్రుత్వంతో వ్యవహరించి, దాయాది పాకిస్థాన్‌ను ప్రశంసించడం, మనదేశంపై భారీ వాణిజ్య సుంకాలు విధించడం, భారత్‌ పట్ల అనాలోచిత వ్యాఖ్యలు చేయడం, వీసాలపై ఆంక్షలు విధించడం ద్వారా భారతదేశాన్ని వేధించడం ప్రారంభించారు. ట్రంప్ భారత్‌ వ్యతిరేక  వైఖరి అవలంబించడానికి కారణం..  డొనాల్డ్‌  ట్రంప్ తన కోసం అధ్యక్ష ఎన్నికలలో ప్రచారం చేయాలని భారత్  ప్రధాని నరేంద్ర మోదీని  కోరారని,  కానీ మోదీ అందుకు నిరాకరించారని చాలామంది భావిస్తున్నారు.

దీంతో ట్రంప్‌  అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన తరువాత  వీసాలు, వలసలకు సంబంధించి అన్ని రకాల సమస్యలను సృష్టించడం ద్వారా  భారతదేశ  ప్రయోజనాలకు హాని కలిగించారు. అయితే, నరేంద్ర మోదీ  ప్రభుత్వం మాత్రం యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్‌ వైఖరిపై  బహిరంగంగా స్పందించకుండా, పరిస్థితి  మరింత ముదరనివ్వకుండా సున్నితంగా వ్యవహరిస్తూ  అద్భుతంగా  ప్రతిస్పందించింది.  ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహం ఫలించి  అక్టోబర్ 2025 నాటికి  ట్రంప్ తన వైఖరిని మార్చుకుని భారతదేశం పట్ల 
మరింత గౌరవంగా ప్రవర్తించడం మొదలైంది. అయినప్పటికీ వలసల విషయంలో మాత్రం డామేజ్‌ కొనసాగింది.

ట్రంప్ చర్యలు పరోక్షంగా భారత్​కు మేలు చేసిన అంశాలు
ట్రంప్   యూరప్‌ను ఒక ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిగా గుర్తించడానికి నిరాకరించారు.  యూరప్‌తో  పాత ఒప్పందాలను  ట్రంప్‌  పెద్దగా పట్టించుకోలేదు. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం పరోక్షంగా  భారతదేశానికి సహాయపడింది, ఎందుకంటే  యూరప్  దేశాలకు  భారతదేశం పట్ల గతంకంటే  మరింత గౌరవం పెరిగింది.   గతంలో యూరోపియన్  దేశాలు  భారతదేశం పట్ల ఉన్నత  వైఖరిని,  ప్రతికూలతను అవలంబించేవి.  ట్రంప్‌ యూరప్‌ పట్ల వ్యతిరేకతను అవలంబించడంతో  ఇప్పుడు యూరప్  భారత్‌ పట్ల  మరింత హంబుల్‌గా వ్యవహరిస్తోంది.


ట్రంప్,  చైనా..  వాస్తవానికి  చైనా  భారతదేశానికి  అతిపెద్ద  శత్రువు.  చైనాకు  భారతదేశంతో ఉన్న 3,500  కిలోమీటర్ల సరిహద్దు వెంబడి భారీగా సైనికులను మోహరించి తరచుగా  సమస్యలను సృష్టిస్తోంది.  అదేసమయంలో భారత్‌ పట్ల సదా వ్యతిరేక ధోరణిని అవలంబించే  మన దాయాది పాకిస్తాన్‌కు  ప్రధాన ఆర్థిక సహాయకురాలిగా చైనా  వ్యవహరిస్తోంది.  భారతదేశం పట్ల పాకిస్తాన్ శత్రుత్వాన్ని  నిత్యం ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు  ట్రంప్  చైనాపై  నిర్విరామంగా  పరోక్ష దాడి చేశారు.  ఈ పరిణామం  భారతదేశానికి ఇతోధికంగా  సహాయపడింది,  ఎందుకంటే  చైనా  దృష్టి  భారత్‌ నుంచి మరల్చడానికి దోహదపడింది.  ఈక్రమంలో   భారతదేశంతో  శాశ్వత శత్రుత్వం మంచిది కాదని  చైనా కూడా అర్థం చేసుకుంది.

ట్రంప్  రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక ఇరాన్‌పై  కూడా శత్రుపూరిత చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఇరాన్  భారతదేశానికి  ప్రత్యక్ష శత్రువు కానప్పటికీ, ఇతర అరబ్ దేశాలు,  టర్కీతోపాటు ఇరాన్ కూడా  పాకిస్తాన్‌కు  మద్దతు ఇచ్చాయి. ఈ క్రమంలో ఇరాన్‌పై  ట్రంప్ ప్రారంభించిన యుద్ధం ఇరాన్  ఇతర అరబ్ దేశాల  దృష్టిని మరల్చింది. అవి ఇప్పుడు ఒకదానితో ఒకటి ఘర్షణలలో చిక్కుకున్నాయి. 

గతంలో సౌదీ అరేబియా, ఖతార్ వంటి కొన్ని అరబ్ దేశాలు తమ డబ్బు తమకు రక్షణ కల్పిస్తుందని, తాము ఇష్టమొచ్చినట్టు వ్యవహరించవచ్చని  భావించేవి.  కానీ,  ట్రంప్ వారిని ఏమాత్రం గౌరవించకుండా, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి బలహీనంగా  కనిపించేలా చేశారు. పాక్,  చైనాలకు రహస్యంగా మద్దతు పలుకుతూ భారతదేశంతో స్నేహ భావం నటిస్తున్న భారతదేశ పొరుగు దేశాలకు ఇది ఒక మంచి గుణపాఠంగా మారింది.

గతంలో  అమెరికా అధ్యక్షులు భారతదేశాన్ని అస్థిరంగా ఉంచడానికి చిన్న దేశాలను ఆకర్షించడానికి తొందరపడేవారు. ఒకవేళ  నేపాల్, శ్రీలంక లేదా మాల్దీవులు భారతదేశం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తే,  వారికి అమెరికా నుంచి తక్షణమే సహాయం అందేది. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు తమ పట్ల ఏమాత్రం గౌరవం లేదని,  వాస్తవానికి, తమకు ఉద్దేశించిన అన్ని సహాయ కార్యక్రమాలను రద్దు చేశారని ఈ దేశాలు తెలుసుకున్నాయి. ఇది భారత్‌కు కలిసొచ్చే అంశం.

ట్రంప్,  పాకిస్తాన్..  ట్రంప్  రెండోసారి  పదవిలోకి రాగానే  సౌదీ అరేబియా,  ఖతార్  ద్వారా పాకిస్తాన్ ఆయనకు  దగ్గరయ్యిందన్నది  నిజం.  పాకిస్తాన్  ప్రభుత్వం  ట్రంప్ కుటుంబానికి గణనీయమైన వ్యాపారం కల్పించిందని వార్తలు వచ్చాయి. కానీ ఇది ట్రంప్‌తో  ఏకపక్ష,  నమ్మదగని స్నేహమని పాకిస్తాన్ కూడా అర్థం చేసుకుంది.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఆంక్షలు, చర్చలపై ట్రంప్ మారుతున్న వైఖరుల కారణంగా రష్యా కూడా అనిశ్చితిని  ఎదుర్కొంటోంది.  రష్యా  చమురుపై ట్రంప్ విధించిన ఆంక్షల వల్ల
 భారతదేశం ఒక సంవత్సరంపాటు చౌకగా రష్యా చమురును  కొనుగోలు చేయగలిగింది.

భారతదేశం గణనీయమైన వ్యూహాత్మక వైఖరిని ప్రదర్శించింది.  భారతదేశం వాషింగ్టన్‌తో తన సంబంధాన్ని వదులుకోలేదు, అలాగే తన వ్యూహాత్మక  స్వయంప్రతిపత్తిని కూడా వదులుకోలేదు. అవసరమైనచోట  చైనాతో సంబంధాలను నిలబెట్టుకుంది,  ఐరోపాతో  సంబంధాలను బలోపేతం చేసుకుంది. ఆసియా, మధ్యప్రాచ్య దేశాలలో భాగస్వామ్యాలను కొనసాగించింది.
 
భారతదేశానికి పాఠాలు
దాదాపు 250 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రధానమంత్రి పామర్‌స్టోన్ ఒక ప్రసిద్ధ మాట చెప్పారు.  ‘దేశాలకు  శాశ్వత మిత్రులు  లేదా శత్రువులు ఉండరు,  కేవలం  శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి’.   భారతదేశం ఈ నియమాన్ని గుర్తుంచుకోవాలి.   వ్యక్తిగత పాలకుల పట్ల భావోద్వేగాలకు లోనుకాకూడదు.  అమెరికా అధ్యక్షులు పాలనాపరంగా మారుతూ ఉంటారు, కానీ జాతీయ ప్రయోజనాలు  మాత్రం కొనసాగుతూ ఉంటాయి.  నాయకుల మధ్య వ్యక్తిగత అనుబంధం దేశాల మధ్య  స్థిరమైన సంబంధానికి హామీ ఇవ్వదు.

భారతదేశం తప్పనిసరిగా బలమైన దౌత్య వ్యవస్థను కలిగి ఉండాలి. యుద్ధాలు విఫలమైనచోట దౌత్యం విజయం సాధించగలదు. భారతదేశం తన విదేశాంగ మంత్రులు,  దౌత్యవేత్తలు తగినంత సుదీర్ఘ పదవీకాలం కలిగి ఉండేలా కూడా ప్రయత్నించాలి.  రష్యా, చైనా విదేశాంగ మంత్రులు దశాబ్దాలుగా ఉన్నత స్థాయి దౌత్యంలో పాలుపంచుకుంటూ, తమ దేశాలకు నిరంతరతను, అనుభవాన్ని అందిస్తున్నారు.

ప్రతిపక్షం విదేశాంగ విధానంతో రాజకీయాలు చేయకూడదు.  ప్రభుత్వం విదేశాంగ విధాన విజయాలను ఏ ఒక్క రాజకీయ పార్టీ విజయాలుగా కాకుండా,  ప్రతిపక్షంతో సహా దేశ విజయాలుగా పరిగణించాలి. డొనాల్డ్ ట్రంప్ వల్ల భారతదేశం  ప్రధానంగా వలసలు, వీసాల విషయంలో నష్టపోయినప్పటికీ, ఇతర దేశాలు అంతకంటే తీవ్రమైన  నష్టాన్ని చవిచూశాయి. 

కానీ,  వాస్తవం ఏమిటంటే ఇతర దేశాలు విఫలమైనప్పుడు ,  అవి భారతదేశానికి తన ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి,  వ్యూహరచన చేయడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని చాలా దేశాలకు శాశ్వతమైన నష్టాన్ని కలిగించారు.  భారతదేశం కూడా నష్టాన్ని ఎదుర్కొంది.  కానీ మరింత బలంగా  సమస్యలను అధిగమించి బయటపడింది! 

డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్

* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]

* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.

* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.