లోలోతుల్లోకి భూగర్భ జలాలు.. హైదరాబాద్ నీటి సంక్షోభానికి కారణాలు, పరిష్కారాలేంటి ?

లోలోతుల్లోకి భూగర్భ జలాలు.. హైదరాబాద్ నీటి సంక్షోభానికి కారణాలు, పరిష్కారాలేంటి ?

హైదరాబాద్ మహానగరం ఆకాశహర్మ్యాలతో ఎత్తుకు ఎదుగుతోంది.  కానీ అదే సమయంలో నగరంలో భూగర్భ జలాలు అంతకంతకూ లోతుల్లోకి జారిపోతున్నాయి. భూగర్భ జలశాఖ తాజా గణాంకాలు, నిపుణుల విశ్లేషణ ఈ పరిస్థితిని స్పష్టంగా చూపిస్తున్నాయి.  తెలంగాణలోని 554 మండలాల్లో భూగర్భ జలాల పరిస్థితిని అధికారులు పరిశీలించారు. ఆ వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సగటు భూగర్భ  జలమట్టం 8.28 మీటర్లు (సుమారు 27 అడుగులు).

గ్రేటర్ హైదరాబాద్‌లో సగటు నీటిమట్టం 7.17 మీటర్లు (సుమారు 23.5 అడుగులు). రాష్ట్రంలోని 31 శాతం ప్రాంతాల్లో నీటిమట్టం సాధారణ స్థాయి కంటే ఎక్కువ లోతులో ఉంది.  కూకట్‌పల్లిలో  ఏకంగా 48.35 మీటర్ల లోతులో (దాదాపు 159 అడుగులు) నీటిమట్టం నమోదైంది. ఇది సుమారు 16 అంతస్తుల భవనం ఎత్తుకు సమానం. గత ఏడాదితో పోలిస్తే కూకట్‌పల్లిలో మట్టం మరో 3.86 మీటర్లు (సుమారు 12.7 అడుగులు) పడిపోయింది.
 
ఈ గణాంకాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవి పరిశీలన కేంద్రాల వద్ద నమోదైన కొలతలు మాత్రమే. కూకట్‌పల్లిలో బోరు వేస్తే సరిగ్గా అదే లోతులో నీళ్లు పడతాయని కాదు. అలాగే రాష్ట్రమంతటా పరిస్థితి ఒకేలా లేదు.  కొన్ని మండలాల్లో  గత ఏడాదితో  పోలిస్తే నీటిమట్టం మెరుగుపడగా,  మరికొన్నింటిలో పడిపోయింది. 

అయితే, పూర్తిగా భూగర్భ జలాలపై ఆధారపడి విస్తరించిన నగరంలో భూగర్భ జలాలపై లోతైన పరిశోధనలు జరగడం లేదు. భూగర్భ జలశాఖ పని నీటిమట్టాల అంచనాలకే పరిమితం. ఆ శాఖ సేకరించే గణాంకాల్లోనూ అనేక వ్యత్యాసాలున్నాయి. ప్రభుత్వ దృష్టి లేకపోవడంతో వారికి కావాల్సిన వనరులు, పరికరాలు లేవు. ఏళ్ల పోరాటం తర్వాత భూగర్భ  జల నియంత్రణ చట్టం వచ్చినా అమలు లేదు.

భూగర్భ జలాలు ఎందుకు తగ్గుతున్నాయి ?

నగర నీటి వ్యవస్థను దగ్గరగా చూస్తున్న నిపుణుడిగా నేను గమనించిన ఆరు ప్రధాన కారణాలివి.

1. బోర్‌వెల్‌పై అతిగా ఆధారపడటం..
నాకున్న అంచనా మేరకు గత 40 ఏళ్లుగా హైదరాబాద్ నిర్మాణ విస్తరణ ఎక్కువగా భూగర్భ జలాలపైనే ఆధారపడి సాగింది. జల మండలి సరఫరా చేసే నీరు నగర అవసరాల్లో కేవలం 30–40 శాతమే ఉండగా,  కొన్ని ప్రాంతాల్లో అసలు సరఫరానే లేదు. మాస్టర్ ప్లాన్ ప్రకారం విస్తరణ జరగకపోవడంతో కొత్త కాలనీలు బోర్‌వెల్‌తోనే మొదలవుతున్నాయి. బోరు వేసినా నీళ్లు పడకపోతే ట్యాంకర్ల ద్వారా వేరే ప్రాంతాల నుంచి నీటిని తెప్పించి నిర్మాణాలు పూర్తి చేయడం ఆనవాయితీగా మారింది.

2. సులభంగా బోర్లు.. విపరీతంగా వినియోగం
పెట్టుబడిపరంగా బోర్‌వెల్ వేయడం సులభం కావడంతో వినియోగం విపరీతంగా పెరిగింది. వాణిజ్య, నివాస, ఆర్థిక కార్యకలాపాలతోపాటు అనవసరాలకూ భూగర్భ జలాలనే వాడుతున్నారు. వాహనాల సంఖ్య పెరగడంతో, వాటిని కడగడానికే  కోట్ల లీటర్ల నీటిని వృథా చేయడం అలవాటుగా మారింది.   నీటిఖర్చు గురించి పెద్దగా పట్టింపు లేదు. భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో నీటి లభ్యతను ఒక షరతుగా చేర్చాలని  నేను చాలాకాలంగా కోరుతున్నాను.

3. చెరువులు, కుంటలు కనుమరుగవడం
హైదరాబాద్  డెక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉంది. ఇక్కడ రాతి పొరలు ఎక్కువ. కాబట్టి వర్షపు నీరు భూమిలోకి ఇంకడానికి చాలా సమయం పడుతుంది. ఈ పనిని అనాదిగా ఏర్పడిన చెరువులు, కుంటలు సులభంగా, వేగంగా చేసేవి. కానీ ఇప్పుడు అవి కలుషితమవుతున్నాయి, కొన్ని విస్తీర్ణంలో తగ్గుతున్నాయి, 

అనేకం కనుమరుగవుతున్నాయి. దీంతో భూగర్భ జలనిధి పెరిగే అవకాశాలు తగ్గుతున్నాయి. గండిపేట చెరువు దిగువన ఇటీవల వెలసిన భారీ నిర్మాణాల్లోని బోర్‌వెల్స్​లో  నీళ్లు  లేకపోవడం దీనికి ఒక ఉదాహరణ. నిర్మాణాల కోసం చేసే బ్లాస్టింగ్ వల్ల కింది రాతిపొరలు  కదిలి, భూగర్భ జల వనరులపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది.

4. కాంక్రీట్ మయమైన నగరం
నీటిని భూమిలో ఇముడ్చుకునే మట్టి, నేల పొరలపై కాంక్రీట్ వేయడం వల్ల నగరమంతటా మట్టి కనుమరుగవుతున్న పరిస్థితి ఏర్పడింది. వర్షం పడగానే ఆ నీరు ఎక్కడా ఆగకుండా వేగంగా దిగువ ప్రాంతాలకు ప్రవహిస్తోంది. సమీప అడవులు, చిట్టడవులు కనుమరుగు అవుతున్నాయి. చెట్లు, గడ్డి మైదానాలు, ఖాళీ మట్టి ప్రాంతాలు తగ్గిపోతుండటంతో, పడిన వర్షం భూమిలోకి ఇంకే వ్యవస్థ క్రమంగా తగ్గిపోతోంది. అందుకే భారీ వర్షాలు కురిసినా, రోడ్లపై వరద ప్రవహిస్తుంది కానీ భూమిలో నిల్వలు పెరగడం లేదు.

5. కాలుష్యం
కాంక్రీట్‌పై పడిన ప్రతి వర్షపు చుక్క, నగరంలోని ఇతర నీటి వనరులు, చివరికి భూగర్భ జలనిధి కూడా కలుషితమవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. పారిశ్రామిక ప్రాంతాలైన జీడిమెట్ల, సరూర్‌నగర్‌తో పాటు హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

6. మంచి దిగుబడినిచ్చే బోర్లు ప్రైవేటుపరం, భూగర్భ జలం సరుకుగా మారడం
భూగర్భ జల సమస్యకు మరో కోణం కూడా ఉంది. మంచి దిగుబడినిచ్చే బోర్‌వెల్స్ ప్రైవేటు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లడం, భూగర్భ జలం ఒక వాణిజ్య సరుకుగా మారడం. ఇటీవల హైదరాబాద్‌లో ట్యాంకర్ ఆపరేటర్ల సమ్మె, ఆ తర్వాత జరిగిన చర్చలు ఈ అంశాన్ని బయటపెట్టాయి. 

హైడ్రా అధికారుల ప్రకారం.. ట్యాంకర్ ఆపరేటర్లు రవాణా దూరం, ఇంధన ఖర్చు తగ్గించుకోవడానికి మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, అమీర్‌పేట, అశోక్​నగర్ వంటి డిమాండ్ ఎక్కువున్న ప్రాంతాల్లోనే బోర్లను ఎంచుకుంటున్నారు. గృహ అవసరాల బోర్లు సాధారణంగా 100–300 అడుగుల లోతు వరకే వేస్తారు. కానీ వాణిజ్య ఆపరేటర్లు 1,000–1,500 అడుగులు, అంతకంటే ఎక్కువ లోతుకు తవ్వి, శక్తిమంతమైన మోటార్లతో నీటిని తోడుతున్నారని ఆరోపణలున్నాయి.

నివాస కాలనీల నుంచి భారీ మొత్తంలో నీటిని తోడి,  పేయింగ్  గెస్ట్ హాస్టళ్లతో సహా వాణిజ్య సంస్థలకు సరఫరా చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. తెల్లాపూర్‌లో నిరసనలు జరిగాయి. సూరారం, జీడిమెట్ల ప్రజలు కూడా హైడ్రాను ఆశ్రయించారు. దీంతో ఓఆర్‌ఆర్ వెలుపల నుంచి, సంబంధిత శాఖల అనుమతులతో మాత్రమే భూగర్భ జలాలను తోడేందుకు ట్యాంకర్ ఆపరేటర్లు అంగీకరించారు. ఇది సరైన అడుగే అయినా, కొన్ని బోర్లు ఎండిపోయి మరికొందరి చేతుల్లో  నీరు  సరుకుగా మారే సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

నీరు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోతే..
రిగ్ యజమానుల సంఘం ప్రస్తుతం ఉన్న 120 మీటర్ల (సుమారు 394 అడుగులు) బోర్‌వెల్ లోతు పరిమితిని 250–300 మీటర్లకు (సుమారు 820–985 అడుగులు) పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. జీవో 259ను సవరించాలన్నది వారి డిమాండ్.  అనేక ప్రాంతాల్లో నీటిమట్టాలు పడిపోవడంతో 120 మీటర్లలో నీరు దొరకడం కష్టమవుతోందని, తాగునీరు, వ్యవసాయం, నిర్మాణ అవసరాలకు 250–300 మీటర్ల వరకు తవ్వాల్సి వస్తోందని సంఘం చెబుతోంది.

ఇది నీటిమట్టాల పతనానికి మరో సూచన. అయితే లోతు పరిమితి పెంచితే, లోతైన బోర్లు వేయగలిగినవారికే నీరు దక్కే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. భూగర్భ జలాల వాణిజ్యీకరణ వినియోగంలో సామాజిక అన్యాయాన్ని మరింత పెంచుతుంది. చాలామందికి భూగర్భ జలాలే ఏకైక వనరు. ఆ నీరు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోతే, లక్షలాది సామాన్య, పట్టణ పేద కుటుంబాలు ఖరీదైన ట్యాంకర్ సరఫరాపై ఆధారపడక తప్పని పరిస్థితి వస్తుంది.

భూగర్భ జలమట్టం అంటే ఏమిటి?
భూమి ఉపరితలం నుంచి భూగర్భంలో నీరు ఉన్న స్థాయి వరకు ఉన్న దూరాన్నే భూగర్భ జలమట్టం లోతు అంటారు. రాతిపొరలు, నేల స్వభావం, పగుళ్లు, భౌగోళిక పరిస్థితులను బట్టి ఇది ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది.  అందుకే ఒకే కాలనీలోని రెండు బోర్లకు కూడా వేర్వేరు లోతుల్లో నీరు పడవచ్చు. ఒక ఏడాది గణాంకాలతో తీవ్ర సంక్షోభం తప్పదని చెప్పలేం. కానీ వరుసగా మట్టాలు తగ్గుతూ ఉంటే దాన్ని తీవ్ర హెచ్చరికగానే పరిగణించాలి.

పరిష్కారాలు ఇవి

రెయిన్ వాటర్ హార్వెస్టింగ్: నగరంలో పడిన ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టే వ్యవస్థపై ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి. ప్రతి అపార్ట్​మెంట్, వాణిజ్య భవనం, ఇంట్లో సాధ్యమైనచోట ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. 

చెరువుల పరిరక్షణ: చెరువులు, కుంటలు, సహజ నీటి ప్రవాహ మార్గాలను కాపాడాలి. కాలుష్యాన్ని అరికట్టాలి. 

నిర్మాణ అనుమతుల్లో నీటి లభ్యత: కొత్త భవనాలకు అనుమతులిచ్చే ముందు ఆ ప్రాంతంలో నీటి లభ్యతను పరిశీలించాలి. మాస్టర్ ప్లాన్‌లో పచ్చదనం, హైదరాబాద్ మాస్టర్ ప్లాన్‌లో అడవులు, చెట్లు, పచ్చదనానికి, ఖాళీ ప్రదేశాలకు అవకాశం ఉండాలి. 

వినియోగంలో క్రమశిక్షణ: వృథాను తగ్గించడం, పైపుల లీకేజీలను అరికట్టడం, శుద్ధి చేసిన మురుగునీటిని తోటలకు, తాగునీటియేతర అవసరాలకు వాడటం. వాణిజ్య సముదాయాల్లో నీటి వినియోగాన్ని పర్యవేక్షించడం. కాలుష్యంపై కఠిన చర్యలు: భూగర్భ జలాలను కలుషితం చేసే పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి.

వాణిజ్య నీటి తోడివేతపై నియంత్రణ: ట్యాంకర్ల కోసం భూగర్భ జలాలను తోడే బోర్లకు అనుమతులు, పరిమితులు, తోడే నీటి పరిమాణంపై పర్యవేక్షణ ఉండాలి.  బహుళ అంతస్తుల ప్రాజెక్టులపై తక్షణ ఆంక్షలు: ప్రస్తుత అత్యంత తక్కువ నీటిమట్టాల దృష్ట్యా, భారీ బహుళ అంతస్తుల ప్రాజెక్టులు లోతైన బోర్‌వెల్స్ వేయడం, భూగర్భ జలాలను తోడటంపై కఠిన ఆంక్షలను ప్రభుత్వం తక్షణమే నోటిఫై చేయాలి.  

స్థానిక అధ్యయనాలు బోర్‌వెల్ లోతు పరిమితిని పెంచేముందు ఆ ప్రాంతంలో నీటిమట్టం, రీఛార్జ్ పరిస్థితిని అధ్యయనం చేయాలి. లోతు పెంచడం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. భూగర్భ జలాలను తిరిగి నింపకపోతే సమస్య మరింత లోతుకు వెళ్తుంది. 

కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో నీటి వినియోగం ఎంత, ఎంత వర్షపునీరు భూమిలోకి చేరుతోంది, గత ఐదు, పదేళ్లలో మట్టాలు ఎలా మారాయనే అంశాలను స్థానిక సంస్థలు అధ్యయనం చేయాలి. రోడ్లు, ఫ్లైఓవర్లు, మెట్రో, భారీ భవనాలు ఆధునిక నగర అభివృద్ధికి సూచికలే. కానీ భూమిపై ఎన్ని అంతస్తులు నిర్మించినా,  నీటి వనరులను కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో అవసరాలు తీర్చుకోవడం కష్టం.  అభివృద్ధితోపాటు నీటి సంరక్షణ కూడా జరగాలి. భూగర్భ జలాలను కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడమే. 

డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ [email protected]

* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.

* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.