నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణం’ సినిమాపై దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రశంసలు కురిపించారు. సినిమా విజువల్స్, గ్రాండ్ మేకింగ్, నటీనటుల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ముఖ్యంగా రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యశ్, సీతగా సాయి పల్లవి నటన ఆకట్టుకుందని అన్నారు. రణ్‌బీర్ వనవాసం సన్నివేశాల నుంచి ఎంతో ప్రశాంతంగా, అద్భుతంగా నటించారని ప్రశంసించారు. యశ్ రావణుడిగా భయంకరమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించారని, సాయి పల్లవి సీతగా ఎంతో హుందాగా కనిపించారని పేర్కొన్నారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ తనకు ఎంతో నచ్చాయని తెలిపారు. ఇంతటి ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా సహా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
రాజమౌళి చేసిన ఈ ప్రశంసలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ‘రామాయణం’ సినిమాకు ఆయన ప్రశంసలు మరింత హైప్ తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.
#Ramayana… the sheer scale of the film and the visuals on the big screen are spectacular to watch. Ranbir as Rama, especially from the Vanavasam onwards, is serene yet magnificent. Yash brings a menacing presence as Ravana, while Sai Pallavi is graceful as Sita. The pre-climax and climax… loved every bit of it. Congratulations @malhotra_namit, @niteshtiwari22 and the entire team on bringing such an ambitious vision so beautifully to the screen. 🙏
— rajamouli ss (@ssrajamouli) November 5, 2026
‘రామాయణం’ సెకండ్ డే టాక్..
ఇక సినిమా విడుదలైన తర్వాత వస్తున్న టాక్ కూడా పాజిటివ్‌గానే ఉంది. ముఖ్యంగా భారీ విజువల్స్, గ్రాండ్ సెట్స్, యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రణ్‌బీర్ కపూర్ రాముడిగా ఒదిగిపోయారని, యశ్ రావణుడి పాత్రలో తనదైన నటనతో మెప్పించారని ప్రశంసలు వస్తున్నాయి. సాయి పల్లవి నటనకు కూడా మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా జటాయువు ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయని ప్రేక్షకుల అభిప్రాయం. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగాయని, కథనంలో అక్కడక్కడా సాగదీత ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ‘రామాయణం’ విజువల్ గ్రాండియర్, నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది.
వారణాసిలో రామాయణం ఎపిసోడ్..
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాలో రామాయణానికి సంబంధించిన ప్రత్యేక ఎపిసోడ్ ఉండనుంది. ఇందులో మహేశ్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా ఈ ఎపిసోడ్‌ను రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు రాముడి గెటప్‌లో కనిపించే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, మహేశ్ బాబు శ్రీరాముడిగా కనిపించే సన్నివేశాల నిడివిపై చిత్ర బృందం నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. రాజమౌళి తనదైన విజువల్ గ్రాండియర్‌తో రామాయణ ఘట్టాలను ఎలా చూపించబోతున్నారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ముఖ్యంగా మహేశ్ బాబును శ్రీరాముడిగా వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
