భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ ఎట్టకేలకు నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటించిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ తొలి రోజే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ వసూళ్లను కలుపుకుని తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.127.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. ఇకపోతే, మేకర్స్ నుంచి అధికారిక వసూళ్ల పోస్టర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఫస్ట్ డే ఇండియా కలెక్షన్స్ ఎంతంటే?
ట్రేడ్ లెక్కల ప్రకారం.. ‘రామాయణం’ తొలి రోజు ఇండియాలో రూ.64.85 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. అన్ని భాషల్లో కలిపి రూ.77.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దేశవ్యాప్తంగా సుమారు 25,200 షోలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే సుమారు రూ.50.5 కోట్ల వసూళ్లు రావడంతో మొదటి రోజు కలెక్షన్లు రూ.100 కోట్ల మార్కును దాటుతాయని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. ఇక ఓవర్సీస్ వసూళ్లను కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.127.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇక వీకెండ్ లో వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి.
హిందీలో దుమ్మురేపిన రామాయణం..
తొలి రోజు వసూళ్లలో హిందీ వెర్షన్ అగ్రస్థానంలో నిలిచింది. మిగిలిన భాషల్లోనూ సినిమా మంచి వసూళ్లను నమోదు చేసింది.
హిందీ – రూ.47.50 కోట్లు
కన్నడ – రూ.7.25 కోట్లు
తెలుగు – రూ.6 కోట్లు
తమిళం – రూ.2.60 కోట్లు
మలయాళం – రూ.1.50 కోట్లు
మొత్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.64.85 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా హిందీ మార్కెట్ నుంచే హయ్యెస్ట్ కలెక్షన్లు రావడం విశేషం.
ఆదిపురుష్ రికార్డు మాత్రం మిస్!
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజు వసూళ్లలో మోస్తరు ఓపెనింగ్ అందుకుంది. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ 2023లో విడుదలైన తొలి రోజే అన్ని భాషల్లో కలిపి రూ.86.75 కోట్ల ఇండియా నెట్ వసూళ్లను సాధించింది. అయితే, ‘రామాయణం’ మాత్రం రూ.64.85 కోట్లతో సరిపెట్టుకుంది. అంటే ఆదిపురుష్ తొలి రోజు వసూళ్ల కంటే రామాయణం కలెక్షన్లు తక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే, 2026లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన బాలీవుడ్ చిత్రాల జాబితాలో ‘ధురంధర్: ది రివెంజ్’ తర్వాత రెండో స్థానాన్ని రామాయణం దక్కించుకుంది. దీంతో ఈ సినిమా ఓపెనింగ్‌ను తక్కువగా అంచనా వేయలేమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
రామాయణం ముందున్న అసలైన పరీక్ష!
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ రామాయణం చిత్రానికి మొత్తం రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్ ఉన్నట్లు టాక్ ఉంది. ఈ నేపథ్యంలో సినిమా లాంగ్ రన్లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తొలి వారాంతంలోనే రూ.375 కోట్ల నెట్ వసూళ్లను సాధించవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే సినిమా అసలు సత్తా రాబోయే రోజుల్లో వచ్చే ప్రేక్షకుల స్పందన, వీకెండ్ కలెక్షన్లు, విదేశీ మార్కెట్ వసూళ్లపై ఆధారపడి ఉంటుంది.
మొత్తానికి.. భారీ అంచనాలతో వచ్చిన రామాయణం తొలి రోజే రూ.64.85 కోట్ల ఇండియా నెట్ వసూళ్లతో సత్తా చాటింది. కానీ ఆదిపురుష్ ఓపెనింగ్ రికార్డును మాత్రం అధిగమించలేకపోయింది. మరి రాబోయే రోజుల్లో రామాయణం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి..
