హైదరాబాద్, వెలుగు: దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. 2026 సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో సంస్థ నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం పెరిగి రూ.12,076 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.10,053 కోట్ల లాభం సాధించింది. బీమా ప్రీమియం ఆదాయం పెరగడం సంస్థ లాభాల వృద్ధికి ప్రధానంగా దోహదపడింది. సెప్టెంబర్ క్వార్టర్లో ఎల్‌ఐసీ మొత్తం ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.
గత ఏడాది ఇదే కాలంలో రూ.2,39,614 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈసారి రూ.2,62,739 కోట్లకు చేరింది. అంటే ఏడాది వ్యవధిలో సుమారు 9.65 శాతం వృద్ధి నమోదైంది. బీమా వ్యాపార కార్యకలాపాలు విస్తరించడం, ప్రీమియం వసూళ్లు పెరగడం ఆదాయ వృద్ధికి తోడ్పడ్డాయి. సంస్థ నికర ప్రీమియం ఆదాయం మరింత మెరుగైన వృద్ధిని నమోదు చేసింది.
గత ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో రూ.1,26,479 కోట్లుగా ఉన్న నికర ప్రీమియం ఆదాయం ఈసారి రూ.1,47,018 కోట్లకు పెరిగింది. దాదాపు 16.24 శాతం వృద్ధి నమోదైంది. ఇప్పటికే బీమా పాలసీలు తీసుకున్న వినియోగదారులు చెల్లించే రెన్యువల్ ప్రీమియం కూడా పెరగడం సంస్థకు సానుకూల పరిణామంగా నిలిచింది. గత ఏడాది రూ.64,996 కోట్లుగా ఉన్న రెన్యువల్ ప్రీమియం ఈసారి రూ.68,375 కోట్లకు చేరింది.
