ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు లేకపోతే RC, డ్రైవింగ్ లైసెన్స్ బంద్

ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు లేకపోతే RC, డ్రైవింగ్ లైసెన్స్ బంద్
  • అవి లేకుంటే ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ ఇతర సేవలు బంద్
  • రాష్ట్రంలోని వెహికిల్స్ వివరాలన్నీ కేంద్ర పోర్టల్‌‌లోకి..
  • అక్కడి నుంచే నేరుగా యజమానులకు ఎస్ఎంఎస్‌‌‌‌‌‌‌‌లు
  • రాష్ట్రంలో 1.82 కోట్ల వెహికిల్స్.. గ్రేటర్‌‌‌‌లోనే 93 లక్షలు

హైదరాబాద్, వెలుగు: ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉంటేనే రాష్ట్రంలో రోడ్డుపై తిరిగే ఏ రకమైన వాహనమైనా ఇక నుంచి రవాణా సేవలు అందనున్నాయి. వీటి విషయంలో ఏ వాహన యజమాని నిర్లక్ష్యం చేసినా వారికి ఇక నుంచి నేరుగా ఆన్​లైన్ రవాణా సేవలు అందుబాటులోకి రావు. నేరుగా ఆర్టీఏ ఆఫీసులకు అనుమతించరు.

ఎందుకంటే తెలంగాణ రవాణా శాఖ ‘వాహన్’ పోర్టల్‌‌లో చేరడంతో రాష్ట్రంలోని అన్ని రకాల వాహనాల చిట్టా కేంద్ర పోర్టల్‌‌లోకి  వెళ్లిపోయింది. దీంతో ఈ రెండు సర్టిఫికెట్లలో ఏ ఒక్క దాని గడువు ముగిసినా, వాటి రెన్యూవల్ విషయంలో నిర్లక్ష్యం చేసినా నేరుగా వెహికిల్స్ ఓనర్లకే అలెర్ట్ మెసేజ్‌‌లు వెళ్తున్నాయి. ఆ మెసేజ్ లు వెళ్లిన తర్వాత కూడా వాటిని రెన్యూవల్ చేయించుకోని పక్షంలో రవాణాశాఖ అధికారులు నిఘా పెడతారు.

మొదటిసారి పట్టుపడితే రూ.2 వేలు, రెండోసారి పట్టుపడితే రూ.4 వేలు, మూడోసారి పట్టుపడితే ఏకంగా వాహనాన్ని సీజ్ చేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా 1.82 కోట్ల వెహికిల్స్ ఉంటే ఇందులో టూ వీలర్లు 1.2 కోట్లు, కార్లు, క్యాబ్ లు 23.3 లక్షలు, ట్రాక్టర్లు, గూడ్స్ మరో 12 లక్షలు ఉంటాయి. ఇక ఒక్క గ్రేటర్ పరిధిలోనే దాదాపు 93 లక్షల వెహికిల్స్ ఉండగా, ఇందులో టూవీలర్లు 63 లక్షలు, కార్లు 16 లక్షలు, మిగితా ట్రాలీలు, గూడ్స్, ఆటోలు, క్యాబ్ లు 14 లక్షల వరకు ఉంటాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇన్సూరెన్స్ లేకపోవడం నేరం !
ఇన్సూరెన్స్, పొల్యూషన్ రెండింటిలో ఏదో ఒకటి లేని వాహనాలు రాష్ట్రంలో సుమారు 50 శాతం వరకు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోవడం చట్ట ప్రకారం నేరం. వెహికిల్ ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు, ఎదుటి వాహనం డ్యామేజీ జరిగినా, ఎదుటి వ్యక్తికి ఏదైనా జరిగిన నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

ఇక పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ లేకపోవడం వల్ల వాహన కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా హైదరాబాద్ ను పొల్యూషన్ ఫ్రీ సిటీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహనాల విషయంలో అధికారులు నిఘా పెట్టి కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.