ఓయూ,వెలుగు : ఎస్సీ వర్గీకరణ చట్టంలోని రోస్టర్ విధానంతో తమకు అన్యాయం జరుగుతోందని, సవరించాలని పోరాటం చేస్తుంటే కనీసం కేబినెట్ సమావేశంలో మాట్లాడకపోవడం దారుణమని మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ మండిపడ్డారు. గురువారం ఓయూలో జరిగిన జేఏసీ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్ తో కలిసి మాట్లాడారు.
వర్గీకరణ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతూ ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి రోస్టర్ విధానాన్ని సవరించకపోతే మాల సమాజం, మాల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మాల విద్యార్థి జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు పాల్గొన్నారు.
