కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌‌‌లకు బీజేపీయే అసలైన ప్రత్యామ్నాయం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌‌‌లకు బీజేపీయే అసలైన ప్రత్యామ్నాయం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బీజేపీయే అసలైన ప్రత్యామ్నాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీల తీరుతో విసిగిపోయిన ప్రజలు, యువత ప్రస్తుతం ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ వైపే ఆశగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

గురువారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పాతబస్తీకి చెందిన వివిధ పార్టీల నేతలు బీజేపీలో చేరారు. వారికి రాంచందర్ రావు కాషాయ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన పాలన, దూరదృష్టి గల నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి రక్ష అని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని చెప్పారు. ఆ నమ్మకంతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను వీడి పెద్ద ఎత్తున యువత, వివిధ వర్గాల ప్రముఖులు కమలం గూటికి  చేరుతున్నారని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ చేరికల కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, రాష్ట్ర అధికార ప్రతినిధి సందీప్ సాయి సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.