హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇన్ సర్వీస్ స్పెషల్ టెట్– 2 పరీక్షకు హాజరవుతున్న టీచర్ల కోసం మాక్ టెస్ట్ డేటా గురువారం అందుబాటులోకి వచ్చింది. కంప్యూటర్ ఆధారిత పరీక్షపై అవగాహన పెంచుకునేందుకు అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని టీజీటెట్ కన్వీనర్ గాజర్ల రమేష్ కోరారు. అభ్యర్థులు ఎక్కడి నుంచైనా తమ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్ల ద్వారా అధికారిక లింక్ https://tgtet.aptonline.in లో మాక్ టెస్ట్ రాయవచ్చని పేర్కొన్నారు.
దీనికోసం అభ్యర్థులు తమ జర్నల్ నంబర్, పుట్టిన తేదీ, పరీక్ష రాసే పేపర్‌ను ఎంపిక చేసుకుని సులభంగా లాగిన్ కావచ్చని వెల్లడించారు. కంప్యూటర్ ఆపరేటింగ్ విషయంలో ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ల సాంకేతిక సహాయం అవసరమైన అభ్యర్థులు మాత్రమే నిర్దేశిత మాక్ టెస్ట్ సెంటర్ స్కూళ్లకు నేరుగా వెళ్లాలని కన్వీనర్ స్పష్టం చేశారు. అలాంటి అవసరం లేని టీచర్లు నేరుగా సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదని, ఇంట్లో నుంచే లింక్ ద్వారా ప్రాక్టీస్ చేసుకోవచ్చని సూచించారు.
