హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ప్రదర్శనల్లో ఒకటైన 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో 2026కు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈనెల 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనున్న ఈ ప్రదర్శనలో 120 దేశాల నుంచి 51వేల మందికి పైగా పరిశ్రమ ప్రతినిధులు పాల్గొననున్నారు. సుమారు 550కి పైగా సంస్థలు కోళ్ల పెంపకం పరికరాలు, హాచరీలు, దాణా తయారీ యంత్రాలు, ఆటోమేషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏడు హాళ్లలో ప్రదర్శించనున్నాయి.
నవంబర్ 24న హైటెక్ సిటీలో జరగనున్న పౌల్ట్రీ నాలెడ్జ్ డే కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి ఎస్.పీ.సింగ్ బఘేల్ పాల్గొని ఈ ఎక్స్పోను అధికారికంగా ప్రారంభిస్తారు. కోళ్ల ఆరోగ్యం, దాణా నిర్వహణ, ఆటోమేటెడ్ సెంటర్లు, ఏఐ తదితర అంశాలపై ఈ నాలెడ్జ్ డేలో నిపుణులు చర్చిస్తారు.
దేశంలో సుమారు 60 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించేందుకే ఈ ఎక్స్పోను ఏర్పాటు చేసినట్లు ఐపీఈఎంఏ వెల్లడించింది.
