మీ విజయం దేశానికి స్ఫూర్తి... పారా ఏషియాడ్‌‌‌‌‌‌‌‌ విజేతలతో మోదీ..

మీ విజయం దేశానికి స్ఫూర్తి... పారా ఏషియాడ్‌‌‌‌‌‌‌‌ విజేతలతో మోదీ..
  • లాస్‌‌‌‌‌‌‌‌ ఏంజిల్స్‌‌‌‌‌‌‌‌ పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టండి
  • క్రీడా వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం 

న్యూఢిల్లీ: జపాన్‌‌‌‌‌‌‌‌లో ముగిసిన పారా ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన పారా అథ్లెట్లు గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ  సందర్భంగా అథ్లెట్ల పోరాటాలు, విజయాలు యావత్‌‌‌‌‌‌‌‌ దేశానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. చేతులు లేని ఆర్చర్‌‌‌‌‌‌‌‌ శీతల్‌‌‌‌‌‌‌‌ దేవి, దృష్టి లోపం ఉన్న స్ప్రింటర్‌‌‌‌‌‌‌‌ సిమ్రాన్‌‌‌‌‌‌‌‌ వంటి రెండు స్వర్ణాలు సాధించిన క్రీడాకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్లేయర్లు ప్రధానికి బహుమతులు అందజేయగా,  మోదీ కొంత మంది అథ్లెట్లకు స్వీట్లు తినిపించారు. ‘మీ అద్భుతమైన ప్రదర్శన, క్రీడా ప్రపంచంలో ఇండియా ఒక గొప్ప శక్తిగా ఎదుగుతోందని చూపిస్తోంది. 

మీరు కేవలం పతకాలు గెలవడమే కాకుండా, లక్షలాదిమంది భారతీయుల హృదయాలను కూడా గెలుచుకున్నారు. మీ పోరాటాలు, మీ విజయాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తాయి. గతంలో తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడారంగంలోకి తీసుకొచ్చేందుకు భయపడేవారు. ప్రతిభను ప్రోత్సహించని ఈ వ్యవస్థ గురించి ఏమీ చేయలేమని ప్రజలు అనేవారు. కానీ మీరు ఎలాగైతే వదిలిపెట్టలేదో మేం కూడా మా లక్ష్యాలపై అలాగే దృష్టి సారించాం. 

దేశంలోని యువత ప్రతిభ వృథా కాకూడదు. మీ పురోగతికి ఆటంకం కలిగించిన వ్యవస్థను మార్చాలని మేం నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఒక యువకుడికి తన ప్రతిభపై నమ్మకం ఉంటే దేశం అతనికి అండగా నిలుస్తుందనే విశ్వాసం కూడా పెరిగింది’ అని మోదీ వ్యాఖ్యానించారు. 

ప్రదర్శన మెరుగుపడింది..

గతంలో దేశం అంతగా పోటీపడిన అనేక క్రీడాంశాల్లో ఇండియా ప్రదర్శన బాగా మెరుగుపడిందని మోదీ అన్నారు. ‘గతంలో భారతదేశ ప్రాతినిధ్యం చాలా పరిమితంగా ఉన్న క్రీడలలో మనం ఇప్పుడు బలంగా తయారవుతున్నాం. ఆర్చరీ, అథ్లెటిక్స్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, జూడో, పవర్‌‌‌‌‌‌‌‌ లిఫ్టింగ్ వంటి ఎన్నో క్రీడలలో మనం యువ ప్రతిభను కనుగొంటున్నాం. కొత్త చాంపియన్‌‌‌‌‌‌‌‌లను తయారు చేస్తున్నాం. 

ఆసియా పారా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో 61 మంది అథ్లెట్లు తొలిసారిగా బరిలోకి దిగినవారే’ అని మోదీ గుర్తు చేశారు.  గేమ్స్‌‌‌‌‌‌‌‌కు కొన్ని నెలల ముందు తన తల్లిని కోల్పోయి, తన స్వర్ణ పతకాన్ని ఆమెకు అంకితం చేసిన జావెలిన్ త్రోయర్ రింకు హూడాను ప్రధాని ప్రత్యేకంగా  అభినందించారు. చిన్నతనంలో జరిగిన ఒక ప్రమాదంలో రింకు తన ఎడమ చేతిని కోల్పోయాడు. ‘ఆ క్షణంలో నువ్వు యావత్ దేశాన్ని భావోద్వేగానికి గురిచేశావు’ అని ప్రధాని వెల్లడించారు.

రూ. 1800 కోట్ల విలువైన పథకం

దేశ క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను మోదీ వివరించారు. ‘క్రీడా మౌలిక సదుపాయాలు, క్రీడా పరికరాల ఉత్పత్తి, చివరికి ప్రసార రంగ ఆర్థిక వ్యవస్థను కూడా అన్నిచోట్లా విస్తరిస్తున్నాం. కొన్ని రోజుల కిందట  ప్రభుత్వం ఖేలో ఇండియా కోసం రూ. 1,800 కోట్లకు పైగా విలువైన క్రీడా వస్తువుల తయారీ పథకాన్ని ఆమోదించింది.  క్రీడా వస్తువుల తయారీ పరిశ్రమ కొత్తగా ఏదైనా చేయాల్సిన సమయం ఇదే.  

భారతదేశ క్రీడా ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు చేరాలి.  ఇది భారతదేశ ఎంఎస్ఎంఈ రంగానికి కొత్త బలాన్ని ఇస్తుంది. చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త అవకాశాలు సృష్టించబడతాయి’ అని మోదీ వివరించారు. ఏషియాడ్‌‌‌‌‌‌‌‌ విజయం తర్వాత 2028 లాస్‌‌‌‌‌‌‌‌ ఏంజిల్స్ పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టాలని అథ్లెట్లను కోరారు. ‘ఈ విజయాన్ని పెద్ద లక్ష్యాల కోసం ఒక ప్రారంభ వేదికగా ఉపయోగించుకోవాలి. ఇండియాతో పాటు మీలో చాలా మంది తర్వాతి లక్ష్యం లాస్ ఏంజిల్స్ పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌. 

ఇందులో వీలైనంత ఎక్కువమంది క్రీడాకారులు పాల్గొని, వీలైనన్ని ఎక్కువ పతకాలు సాధించడమే మన లక్ష్యం. ఈ క్షణాన్ని ఆస్వాదించండి మరియు భవిష్యత్తు కోసం సిద్ధమవ్వడం ప్రారంభించండి’ అని మోదీ వ్యాఖ్యానించారు. గత నెల ఐచీ -నగోయాలో జరిగిన పారా ఏషియాడ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా తరఫున మొత్తం 97 మంది అథ్లెట్లు బరిలోకి దిగారు. 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్యాలతో సహా 114 పతకాలు గెలుచుకుని, ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా నాలుగో స్థానంలో నిలిచారు.