వాన.. వరద..  చెట్టుకొమ్మలు పట్టుకొని 12 గంటలు.. ఎట్టకేలకు బతికి బయటపడ్డ  రెస్క్యూ టీమ్

వాన.. వరద..  చెట్టుకొమ్మలు పట్టుకొని 12 గంటలు.. ఎట్టకేలకు బతికి బయటపడ్డ  రెస్క్యూ టీమ్
  • బేతుపల్లి చెరువులో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు
  • కాపాడేందుకు వెళ్లిన రెండు ఎస్డీఆర్ఎఫ్​ బోట్లు బోల్తా
  • వరదలో కొట్టుకుపోయిన 11 మంది రెస్క్యూ సిబ్బంది
  • తెల్లవారుజామున సురక్షితంగా ఒడ్డుకు చేరిన 18 మంది 

సత్తుపల్లి, వెలుగు: చుట్టూ చిమ్మ చీకటి.. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద.. చేతికి దొరికిన చెట్టు కొమ్మే ఆసరా. ఆ కొమ్మను వదిలితే ప్రాణం పోయినట్టే. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 12 గంటల పాటు 11 మంది బిక్కుబిక్కుమంటూ బతుకు జీవుడా అని గడిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి రిజర్వాయర్‌‌లో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపింది. 

వరదలో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన రెస్క్యూ టీమ్ బోట్లే బోల్తా పడి, వారే వరదలో కొట్టుకుపోయారు. రాత్రంతా అధికారులు, ప్రజాప్రతినిధులు ఒడ్డున ఊపిరి బిగబట్టి ఎదురుచూశారు. చివరికి గురువారం తెల్లవారుజామున మత్స్యకారులు, రెస్క్యూ సిబ్బంది కలిపి 18 మందీ క్షేమంగా ఒడ్డుకు చేరడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

చేపల కోసం దిగితే..

మురసు తుఫాను వానలకు పాల్వంచ, దమ్మపేట మండలాల అటవీ ప్రాంతాల నుంచి వచ్చిన వరద మల్లెపూల వాగు మీదుగా బేతుపల్లి రిజర్వాయర్‌‌కు చేరడంతో అది పూర్తిస్థాయి నీటిమట్టాన్ని దాటేసింది. రిజర్వాయర్‌‌లో పెంచుతున్న చేపలు అలుగు మీదుగా కొట్టుకుపోతాయనే ఆందోళనతో బుధవారం ఏడుగురు స్థానిక మత్స్యకారులు అలుగు దగ్గర వలలు కట్టేందుకు నీళ్లలోకి దిగారు. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో అక్కడే చిక్కుకుపోయారు.

కాపాడబోయిన వారే గల్లంతు

భద్రాద్రి కొత్తగూడెంలోని 6వ బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించారు. రెస్క్యూ సిబ్బంది బోటులో వెళ్లి ముగ్గురు మత్స్యకారులను ఒడ్డుకు చేర్చారు. మిగిలినవారి కోసం 10 మంది రెస్క్యూ సిబ్బంది, దారి చూపేందుకు ఓ స్థానిక మత్స్యకారుడితో కలిసి రెండు బోట్లలో మళ్లీ రిజర్వాయర్‌‌లోకి వెళ్లారు. 

అలుగు దగ్గరికి చేరుకోగానే, అక్కడ లోతు ఎక్కువని మత్స్యకారుడు హెచ్చరించాడు. దీంతో ముందున్న బోటును ఒక్కసారిగా వెనక్కి తిప్పగా, అది వెనకున్న బోటును బలంగా ఢీకొట్టింది. రెండు బోట్లూ బోల్తా పడి, అందులోని 11 మంది వరదలో కొట్టుకుపోయారు.

కొమ్మే  ప్రాణం

అప్పటికే చీకటి పడింది. వరదలో కొట్టుకుపోయినవాళ్లు చేతికి దొరికిన చెట్ల కొమ్మలను గట్టిగా పట్టుకుని వేలాడారు. ఒడ్డున ఉన్నవాళ్లకు వాళ్లు ఎక్కడున్నారో కనిపించని పరిస్థితి. చీకట్లో రెస్క్యూ చేయడం కష్టంగా మారింది. ఆ రాత్రంతా స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి, ఖమ్మం జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పోలీస్ కమిషనర్, ఎస్పీలు రిజర్వాయర్ దగ్గరే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కలెక్టర్‌‌కు ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేశారు.

తెల్లవారుజామున తెరపడిన ఉత్కంఠ

గంటలు గడుస్తున్న కొద్దీ ఒడ్డున ఆందోళన పెరిగింది. చివరికి గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో గల్లంతైనవారి ఆచూకీ దొరికింది. మరో రెండు గంటలు శ్రమించి అందరినీ క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. అందరూ లైఫ్ జాకెట్లు వేసుకుని ఉండటం, ఈత రావడం వల్లే ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు.రిజర్వాయర్ దగ్గరికి వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాత్రంతా దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించిన కలెక్టర్ దివాకర టీఎస్‌‌ను అభినందించారు. రెస్క్యూలో పాల్గొన్న సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. 

రూ.270 కోట్లతో ఆధునిక పరికరాలు : మంత్రి పొంగులేటి

రిజర్వాయర్‌‌ను సందర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మత్స్యకారులను, సిబ్బందిని పరామర్శించి అభినందించారు. అనంతరం సత్తుపల్లి సింగరేణి కాలరీస్ గెస్ట్‌‌హౌస్‌‌లో వరద నష్టంపై సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్డీఆర్ఎఫ్ విభాగాన్ని బలోపేతం చేశామని తెలిపారు. 

దాదాపు రూ.270 కోట్లతో అత్యాధునిక పరికరాలు సమకూర్చడం, పోలీసు, అగ్నిమాపక శాఖలకు చెందిన 1,900 మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వల్లే ఈసారి వరదల్లో చిక్కుకున్న వారిని ఎలాంటి ప్రాణనష్టం లేకుండా రక్షించగలిగామన్నారు. సహాయక చర్యల్లో ప్రాణాలకు తెగించి పనిచేసిన సిబ్బందిలో ఇళ్లు లేని అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. వరదల నష్టంపై మూడు రోజుల్లో సమగ్ర నివేదికలు సమర్పించాలని కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు.