న్యూఢిల్లీ: ఇండియా టెన్నిస్ స్టార్లు సానియా మీర్జా, మహేశ్ భూపతి.. ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ) పాలకవర్గంలోకి అడుగుపెట్టారు. జనరల్ బాడీకి క్రీడాకారుల కోటాలో (ఎస్‌వోఎం) ఎన్నికైన వీరు.. తాజాగా ఏఐటీఏ కార్యవర్గ కమిటీ (ఈసీ)లో కూడా చోటు సంపాదించారు. ఈ ఎన్నికల్లో భూపతి అత్యధికంగా 23 ఓట్లు సాధించగా, సానియాకు 18 ఓట్లు వచ్చాయి. జానకి కృష్ణమూర్తి (13), విశాల్ ఉప్పల్ (7) ఓట్లు సాధించారు.
కార్యవర్గంలో చోటు దక్కడంతో భూపతి, సానియా ఏఐటీఏ పదవుల నుంచి తప్పుకున్నారు. అంతకుముందు స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్ ఔట్‌స్టాండింగ్ మెరిట్ (ఎస్‌వోఎమ్) కోసం జరిగిన ఎన్నికల్లో భూపతి 19, సానియా 18 ఓట్లు సాధించారు. అశుతోష్ సింగ్ (17), షాలిని ఠాకూర్ చావ్లా (16) కూడా పాలకవర్గంలో చోటు దక్కించుకున్నారు.
జానకి కృష్ణమూర్తి (15), విశాల్ ఉప్పల్ (9), గౌరవ్ నాటేకర్ (8), అంకితా బాంబ్రీ (7) ఓటమిపాలయ్యారు. సవరించిన ఏఐటీఏ రాజ్యాంగం ప్రకారం ఇద్దరు మెన్స్, ఇద్దరు విమెన్స్ ప్లేయర్లతో కూడిన నలుగురు ఎస్‌వోఎమ్ ప్రతినిధులుగా జనరల్ బాడీకి ఎన్నికయ్యారు.
