భీమ్‌‌‌‌రెడ్డి ఆస్తులు అటాచ్.. హోంగార్డు లక్ష్మణ్‌‌‌‌ నాయక్ పేరిట 3.20 ఎకరాల భూమి

భీమ్‌‌‌‌రెడ్డి ఆస్తులు అటాచ్.. హోంగార్డు లక్ష్మణ్‌‌‌‌ నాయక్ పేరిట 3.20 ఎకరాల భూమి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సస్పెండెడ్‌‌‌‌ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌‌‌‌రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీస్ అధికారిగా ఆయన సంపాదించిన అవినీతి ఆస్తులపై ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ కొరడా ఝులిపించింది. బినామీ ప్రొహిబిషన్‌‌‌‌ యూనిట్‌‌‌‌(బీపీయూ) యాక్ట్‌‌‌‌ కింద చర్యలు చేపట్టింది. సివిల్‌‌‌‌ వివాదాల్లో సహకరించినందుకు ప్రతిఫలంగా దక్కించుకున్న  స్థిరాస్తులు, కారును తాత్కాలిక జప్తు చేసింది.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో 2 ఇండ్లు, 3.20 ఎకరాల వ్యవసాయ భూమి, టయోటా ఇన్నోవా క్రిస్టా కారును అటాచ్‌‌‌‌ చేసింది. వీటి విలువ అధికారిక లెక్కల ప్రకారం రూ.59.4 లక్షలు కాగా.. ప్రస్తుత మార్కెట్‌‌‌‌ వ్యాల్యూ ప్రకారం రూ. 2 కోట్లకు పైగా ఉంటుందని ఐటీ అంచనా వేసింది. ఈ మేరకు ఈ నెల 3న మూడు వేర్వేరు అటాచ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంద్రకరణ్‌‌‌‌రెడ్డి స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధారంగా..
ఆదాయానికి మించిన ఆస్తులుండటంతో భీమ్‌‌‌‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఏసీబీ అధికారుల సోదాల్లో భీమ్‌‌‌‌రెడ్డి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న బినామీ ఆస్తులపై ఐటీ శాఖకు చెందిన బినామీ ప్రొహిబిషన్‌‌‌‌ యూనిట్‌‌‌‌ విచారణ జరిపింది.

సంగారెడ్డి జిల్లా ముత్తంగిలోని బృందావన్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌లో 200 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 2 ఇండ్లను గుర్తించింది. భీమ్‌‌‌‌రెడ్డి పటాన్‌‌‌‌చెరు డీఎస్పీగా పనిచేసిన సమయంలో జీపీఆర్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ కన్‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌పై వచ్చిన ఫిర్యాదులు నమోదు చేయకపోవడంతోపాటు వివాదాల పరిష్కారంలో అనుకూలంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఇందుకు ప్రతిఫలంగా 2023 జులైలో జీపీఆర్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ జి.కల్యాణ్‌‌‌‌బాబు 2 ఇండ్లను ఇంద్రకిరణ్ పేరిట గిఫ్ట్‌‌‌‌గా ఇచ్చినట్లు విచారణలో తేలింది. కాగా, ఒక్కో ఇంటికి సంబంధించి రికార్డుల్లో రూ.14.2 లక్షల విలువ చూపించినప్పటికీ ఎలాంటి చెల్లింపులు జరగలేదని బినామీ ప్రొహిబిషన్‌‌‌‌ యూనిట్‌‌‌‌ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ మేరకు ఇంద్రకరణ్‌‌‌‌రెడ్డి ఇచ్చిన స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధారంగా భీమ్‌‌‌‌రెడ్డికి బినామీగా గుర్తించి ఆయన పేరిట ఉన్న ఇండ్లను ఐటీ శాఖ జప్తు చేసింది.  

హోంగార్డు పేరిట ఉన్నవీ బినామీ ఆస్తులే..
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి పరిధిలో హోంగార్డు లక్ష్మణ్‌‌‌‌ నాయక్‌‌‌‌ పేరుతో రిజిస్టర్‌‌‌‌ అయిన 4 వ్యవసాయ భూములనూ బినామీ ఆస్తులగా గుర్తించారు. వీటి విస్తీర్ణం మొత్తం 3.20 ఎకరాలు కాగా.. రికార్డుల్లో విలువ రూ.8.9 లక్షలుగా ఉంది. హోంగార్డు స్థాయిలో లక్ష్మణ్‌‌‌‌ నాయక్‌‌‌‌ సంపాదన ఇతర ఆర్థిక వ్యవహారాలను పరిశీలించిన ఐటీ అధికారులు.. అతన్ని భీమ్‌‌‌‌రెడ్డికి బినామీగా గుర్తించారు. భూములకు భీమ్‌‌‌‌రెడ్డినే ప్రత్యామ్నాయ అసలు లబ్ధిదారుగా(బెనిఫిషియల్‌‌‌‌ ఓనర్‌‌‌‌) ఆధారాలు సేకరించి, అటాచ్‌‌‌‌ చేశారు.

ఈ క్రమంలోనే యాపిల్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌‌‌ యజమాని ఆలూరి సురేశ్ నుంచి రూ.22 లక్షల విలువైన టయోటా ఇన్నోవా క్రిస్టాను భీమ్‌‌‌‌రెడ్డి పొందినట్లు గుర్తించారు. పలు వివాదాల్లో యాపిల్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌ ప్రైజెస్‌‌‌‌కు అనుకూలంగా వ్యవహరించినందుకు ప్రతిఫలంగా ఇన్నోవా క్రిస్టాను అందించినట్లు తేల్చారు. ఈ కారును 2024 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ చివరి నుంచి భీమ్‌‌‌‌రెడ్డి వినియోగిస్తున్నారని విచారణలో వెలుగు చూసినట్లు సమాచారం.