ఢిల్లీలో కూలిన మూడంతస్తులభవనం..ఇద్దరు మృతి ..ఇరుకైన వీధులతో సహాయక చర్యలకు అంతరాయం

ఢిల్లీలో కూలిన మూడంతస్తులభవనం..ఇద్దరు మృతి ..ఇరుకైన వీధులతో సహాయక చర్యలకు అంతరాయం
  •  విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఇంజనీర్ల సస్పెన్షన్
  • వరుస ప్రమాదాలతో స్థానికుల భయాందోళన

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి గాయపడ్డారు. చావ్రీ బజార్ మెట్రో స్టేషన్ సమీపంలోని 'గలీ సితారా' ప్రాంతంలో గురువారం ఉదయం 9:50 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. 

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మరోవైపు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ఇక్కడి వీధులు అత్యంత ఇరుకుగా ఉండటం రెస్క్యూ బృందాలకు పెద్ద సవాల్‌‌‌‌గా మారింది.

 వీధులకు ఇరువైపులా వాహనాలు పార్క్ చేసి ఉండటంతో అంబులెన్స్‌‌‌‌లు, రెస్క్యూ వాహనాలు ఘటనాస్థలానికి వెళ్లడం కష్టమైంది. దీంతో స్థానికులు స్పందించి, రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తొలగించి అత్యవసర వాహనాలకు దారి కల్పించారు. రెస్క్యూ సిబ్బంది కాలినడకన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేశారు.

ఇద్దరు అధికారుల సస్పెన్షన్

ఈ ఘటనపై ఢిల్లీ యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) అసిస్టెంట్ ఇంజినీర్ మొహమ్మద్ నదీమ్, జూనియర్ ఇంజినీర్ అమన్ దలాల్‌‌‌‌ను తక్షణమే సస్పెండ్ చేశారు. 

భవన యజమానులను గుర్తించామని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజ్‌‌‌‌బీర్ సింగ్ మీడియాకు వెల్లడించారు. ఢిల్లీలో భవనాలు కూలిపోతున్న ఘటనలు ఇటీవల వరుసగా జరుగుతుండటం పట్ల నగర ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ఘటనపై ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ గతంలో చేపట్టిన సేఫ్టీ ఆడిట్‌‌‌‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారులు క్షేత్రస్థాయిలో నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించకపోవడం వల్లే ప్రాణనష్టం జరుగుతోందని ఆరోపించారు.