ఢిల్లీలో కృత్రిమ వర్షం ట్రయల్..పొల్యూషన్ పెరగడంతో సర్కారు యోచన

ఢిల్లీలో కృత్రిమ వర్షం ట్రయల్..పొల్యూషన్ పెరగడంతో సర్కారు యోచన
  • దీపావళి తర్వాత కాలుష్యం పెరగొచ్చనే ఆందోళనలు
  • గత 15 రోజుల్లో రెండుసార్లు క్లౌడ్ సీడింగ్ 

న్యూఢిల్లీ: దీపావళి, ఛట్ పూజ పండుగల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో  వాయు కాలుష్యం మరింత పెరిగితే, కృత్రిమ వర్షం కురిపించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 367 పాయింట్లు (వెరీ పూర్) నమోదైంది. పలు ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. 

నార్త్ ఢిల్లీలోని జహంగీర్‌‌‌‌పురిలో అత్యధికంగా ఏక్యూఐ 459గా నమోదు కాగా, ఐఐటీ ఢిల్లీ, పంజాబీ బాగ్ ప్రాంతాల్లో ఏక్యూఐ 445గా నమోదైంది. గాలిలో అతిసూక్ష్మ ధూళి కణాలు విపరీతంగా పెరిగిపోయాయి. దట్టమైన పొగమంచు అలుముకోవడంతో ఇండియా గేట్ సహా పలు చారిత్రక కట్టడాలు కనిపించడంలేదు.

30వేల మీటర్ల ఎత్తులో క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్

కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా గత 15 రోజుల్లో ప్రభుత్వం రెండుసార్లు కృత్రిమ వర్షం కురిపించేందుకు ట్రయల్స్‌‌‌‌ను నిర్వహించింది. ఒక ట్రయల్‌‌‌‌ను ఢిల్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు సమీపంలో చేపట్టినట్టు సంబంధిత వర్గాలు ధ్రువీకరించాయి. 

గత ఏడాది 15వేల మీటర్ల ఎత్తులో క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ చేపట్టగా.. ఈసారి మరింత ఎక్కువగా సుమారు 30 వేల మీటర్ల ఎత్తులో ఈ ట్రయల్స్ జరగడం గమనార్హం. మబ్బుల్లోకి సిల్వర్ అయోడైడ్, డ్రై ఐస్ వంటి రసాయనాలను చల్లి వర్షం కురిపించే విధానాన్నే క్లౌడ్ సీడింగ్ అంటారు. అయితే, ఇది కాలుష్యానికి తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

జీఆర్ఏపీ-2 ఆంక్షలు అమలు

ఢిల్లీలో కాలుష్యం తీవ్రమవడంతో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌‌‌‌మెంట్ (సీఏక్యూఎం) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) రెండో దశ ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ధూళిని రేపే నిర్మాణ, కూల్చివేత పనులపై నిషేధం విధించారు.

 అయితే, అత్యవసర ప్రాజెక్టులకు మాత్రం మినహాయింపునిచ్చారు. డీజిల్ జనరేటర్ల వాడకంపై కూడా ఆంక్షలు విధించారు. రోడ్లను మెకనైజ్డ్ పద్ధతిలో ఊడ్చడం, నీటిని స్ప్రింక్లింగ్ చేయడం వంటి చర్యలను వేగవంతం చేశారు. ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు పార్కింగ్ రుసుములను రెట్టింపు చేశారు. ఢిల్లీ బయట నుంచి వచ్చే నాన్- బీఎస్–6  వాహనాలపై నిషేధం విధించడంతో పాటు ప్రజారవాణా సదుపాయాలను మరింత పెంచారు.