- టీజీసీఎస్‌బీలో వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ నీలిమ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా పేరిట ప్రచారం అవుతున్న ఎస్‌ఎంఎస్‌లపై టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) దర్యాప్తు ప్రారంభించింది. రైతు భరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయంటూ వస్తున్న ఎస్‌ఎంఎస్‌లపై వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్. నీలిమ గురువారం సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఐటీ చట్టం సెక్షన్ 43, 66(సీ), 66(డీ) కింద సీఎస్‌బీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వ్యవసాయ శాఖ అధికారిక ఎస్‌ఎంఎస్ హెడర్‌ను ఉపయోగించి నవంబర్ 3, 4 తేదీల్లో ఏకంగా 2,73,128 సందేశాలు రైతులకు చేరినట్టు గుర్తించారు. ఈ మెసేజ్‌లను పంపేందుకు వ్యవసాయ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వలేదని సీఎస్‌బీ అధికారుల విచారణలో వెల్లడైంది.
కాగా, వ్యవసాయ శాఖకు చెందిన అధికారిక ఎస్‌ఎంఎస్ కమ్యూనికేషన్ వ్యవస్థలోకి ఎవరైనా అనధికారికంగా ప్రవేశించారా? అధికారిక హెడర్‌ను దుర్వినియోగం చేశారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఎంఎస్‌లను ఎవరు రూపొందించి పంపించారనే వివరాలు సేకరిస్తున్నారు.
