- ‘డూమ్‌స్క్రోలర్’ కావాలంటున్న ఉదయ్‌పూర్ కంపెనీ
- వీడియోకు 3 లక్షలకు పైగా వ్యూస్
ఉదయ్‌పూర్: గంటల తరబడి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేస్తున్నావని ఇంట్లోవాళ్లు తిడుతున్నారా? అయితే ఇదే పనికి జీతం ఇస్తామంటోంది రాజస్థాన్‌లోని ఓ కంపెనీ. ఉదయ్‌పూర్‌కు చెందిన ‘ఇన్‌ఫ్లూయిష్’ అనే సంస్థ దీపావళి వేళ ఈ వింత జాబ్ ఆఫర్ ప్రకటించింది.
రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ, ఏది ట్రెండింగ్‌లో ఉంది, ఏది వైరల్ అవుతోందో రిపోర్ట్ చేసే వ్యక్తి కావాలని ప్రకటించింది. సంస్థ ఉద్యోగులు ఈ జాబ్ గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
‘డూమ్‌స్క్రోలర్’ కావాలె
‘మీకు నిజంగా ఇన్‌స్టాగ్రామ్ వాడటం ఇష్టమైతే, అందుకు మేమే మీకు డబ్బులిస్తాం. రోజంతా కూర్చుని రీల్స్ స్క్రోల్ చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏది వైరల్ అవుతోందో అందరికీ చెప్పే డూమ్‌స్క్రోలర్ కోసం చూస్తున్నాం’ అని ఆ వీడియోలో ఓ వ్యక్తి చెప్పాడు. అదే పనిగా సోషల్ మీడియాను స్క్రోల్ చేస్తూ ఉండేవారిని ‘డూమ్‌స్క్రోలర్’ అంటారు. ఆసక్తి ఉన్నవారు వీడియో కింద ‘హాయ్’ అని కామెంట్ చేయాలని, ఉదయ్‌పూర్‌లో ఉండేవారికి డైరెక్ట్ మెసేజ్‌లో అప్లికేషన్ లింక్ పంపుతామని తెలిపాడు.
అప్లై చేయాలంటే..
దరఖాస్తు చేయాలనుకునేవారు ‘గ్యాంగ్స్ ఆఫ్ స్టార్టప్’ అనే ఇన్‌స్టా అకౌంట్ బయోలో ఉన్న గూగుల్ ఫామ్ లింక్ ద్వారా అప్లై చేయొచ్చు. అందులో పేరు, ఫోన్ నంబర్, అడ్రస్, ఫుల్‌టైమ్ జాబా, ఇంటర్న్‌షిప్పా ఎంచుకుని, ఏ రోల్ కావాలో, ప్రస్తుత జీతం, ఆశిస్తున్న జీతం ఎంతో చెప్పాలి. రెజ్యూమ్ అప్‌లోడ్ చేయాలి. షార్ట్‌లిస్ట్ అయినవారిని సంప్రదిస్తామని సంస్థ తెలిపింది.
‘బెస్ట్ పర్ఫార్మర్ అవార్డ్ నాదే’
నవంబర్ 4న పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 11 వేల మందికి పైగా అప్లికేషన్ ఫామ్ కావాలని రిక్వెస్ట్ పెట్టారని సంస్థ తెలిపింది. ఈ జాబ్ ఆఫర్‌పై నెటిజన్లు సరదా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇది ‘పర్ఫెక్ట్ జాబ్’ అని ఒకరు, తాను ఎదురుచూస్తున్నది ఇలాంటి అవకాశం కోసమేనని మరొకరు కామెంట్ చేశారు. ‘డ్రీమ్ జాబ్’ అని ఇంకొందరు అంటే, తనను తీసుకుంటే ‘బెస్ట్ పర్ఫార్మర్’ అవార్డ్ కూడా కొట్టేస్తానని ఓ యూజర్ సరదాగా కామెంట్ చేశాడు.
