ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌కు 60 శాతం గ్రాంట్ ఇవ్వండి: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి

ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌కు 60 శాతం గ్రాంట్ ఇవ్వండి: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి
  • బీసీ, ఈబీసీ విద్యార్థులకూ నిధులు ఇవ్వాలని వినతి

న్యూఢిల్లీ, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్, స్కాలర్‌‌‌‌షిప్ పథకాలకు కేంద్రం 60 శాతం గ్రాంట్ ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. గురువారం ఢిల్లీలో బీసీ నేతలతో కలిసి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

రెండు రాష్ట్రాల్లో సుమారు 30 లక్షల మంది స్టూడెంట్స్​ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌తో చదువుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకే కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుందని, అదే విధంగా బీసీ, ఈబీసీ విద్యార్థులకూ నిధులు మంజూరు చేయాలని కోరారు.

తెలంగాణలోని 325 బీసీ గురుకులాలకు సొంత భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సమగ్ర శిక్షా అభియాన్ కింద నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రాల నుంచి నిధులు సరిపోక తెలంగాణలో రూ.8,500 కోట్లు, ఏపీలో రూ.9 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని వివరించారు. రెండు రాష్ట్రాల్లో బీసీ గురుకులాల భవన నిర్మాణాలకూ కేంద్రం నిధులు ఇవ్వాలని తెలిపారు.