ఎన్నికల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి: సీఈవోకు డిప్యూటీ కలెక్టర్ల సంఘం వినతి

ఎన్నికల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి: సీఈవోకు డిప్యూటీ కలెక్టర్ల సంఘం వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిలిచిపోయిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం హైదరాబాద్‌‌‌‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి. సుదర్శన్ రెడ్డిని డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.

ఈ సందర్భంగా అసెంబ్లీ సాధారణ ఎన్నికలు–2023, లోక్‌‌‌‌సభ ఎన్నికలు–2024 నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు (ఆర్‌‌‌‌వో), సహాయ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్‌‌‌‌వో) చేసిన ఖర్చులకు సంబంధించిన అదనపు బడ్జెట్‌‌‌‌ను మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఆయా ఎన్నికల్లో కేటాయించిన బడ్జెట్‌‌‌‌ను మించి వ్యయాలు చేయాల్సి వచ్చిందని, పెండింగ్‌‌‌‌లో ఉన్న ఆ బిల్లులను తక్షణమే విడుదల చేసి అధికారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల సమయంలో వివిధ ఖాతాల కింద ఈసీ కేటాయించిన బడ్జెట్ క్షేత్రస్థాయి అవసరాలకు ఏమాత్రం సరిపోకపోవడంతో పలు అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల్లో భారీగా అదనపు ఖర్చులు చేయాల్సి వచ్చిందని లచ్చిరెడ్డి వివరించారు.

ఎన్నికల ప్రక్రియ నిరంతరాయంగా, విజయవంతంగా సాగేందుకు అధికారులే స్వయంగా అప్పుల రూపంలో నిధులు సమకూర్చుకుని పనులు పూర్తి చేయించారని గుర్తుచేశారు. ఆయా ఖర్చులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు ఇప్పటికీ ప్రభుత్వ స్థాయిలోనే పెండింగ్‌‌‌‌లో ఉండిపోయాయని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం నాయకులు, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు పాల్గొన్నారు.