- జీవోను అన్ని పార్టీలు అంగీకరించాలని విజ్ఞప్తి
- రాహుల్ గాంధీ వల్లే రాజ్యాంగం బతికి ఉందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ జీవోలు ఇవ్వడం అభినందనీయమని ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ అన్నారు. ఇటీవల ఈ భవనాలకు సంబంధించిన మార్గదర్శకాలను బీసీ సంక్షేమ శాఖ విడుదల చేసిందని గుర్తుచేశారు.
ఈ జీవోను అన్ని పార్టీలు అంగీకరించాలని ఆయన కోరారు. జీవోను పూర్తిగా చదవకుండా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. కుల సంఘాల భవనాలు, భూములను లీజు, రెంట్, అమ్మకం చేయడం నిషేధమని మార్గదర్శకాల్లో పేర్కొనడం గొప్ప విషయమన్నారు. మాల, మాదిగలు కూడా ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకోవాలని సూచించారు.
విద్యపై ఫోకస్ పెడితేనే అన్ని కులాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆత్మగౌరవ భవనాలపై షెఫర్డ్ ఇంటలెక్చువల్ ఫోరమ్ (ఎస్ఐఎఫ్) నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంచె ఐలయ్య మాట్లాడుతూ తలసాని శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు గౌడ కులస్తులకు ఏం చేశారని ప్రశ్నించారు. తలసానిని ఎంకరేజ్ చేయొద్దని కేటీఆర్‌ను కోరారు. కుల సంఘాల నేతలు కోకాపేట, ఉప్పల్ భగాయత్‌లో వందల కోట్ల విలువైన ఆత్మగౌరవ భవనాల భూములను దోచుకునే కుట్రలు చేశారని ఆరోపించారు.
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కొమరయ్య పేరు పెట్టాలి
వరంగల్ ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని, అన్ని పథకాలకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పేర్లు పెట్టడం సరికాదని కంచె ఐలయ్య ప్రభుత్వానికి సూచించారు. రాహుల్ గాంధీ ఏ అంశం మీద మాట్లాడినా కేసులు పెడుతున్నారని, ఇప్పటివరకు ఆయనపై 68 కేసులు పెట్టారని గుర్తుచేశారు. ప్రపంచంలో ఏ లీడర్‌పై ఇన్ని కేసులు పెట్టలేదని, ఆయన వల్లే రాజ్యాంగం ఇంకా బతికి ఉందన్నారు.
తెలంగాణలో చేతివృత్తులను ఆగం చేశారని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అన్నారు. జ్యోతిబా ఫూలే సినిమాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల, హెండేవార్ గురునాథ్ కురుమ, మంత్రి సుభాష్ కురుమ, పాండు కురుమ, శ్రీనివాస్ కురుమ తదితరులు పాల్గొన్నారు.
