చండీగఢ్ దంపతులపై అమెరికా ఆంక్షలు ..ఇరాన్ షిప్‌‌‌‌లకు ఫేక్ రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారని ఆరోపణ

చండీగఢ్ దంపతులపై అమెరికా ఆంక్షలు ..ఇరాన్ షిప్‌‌‌‌లకు ఫేక్ రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారని ఆరోపణ

వాషింగ్టన్: ఇరాన్ రహస్య నౌకాదళానికి (షాడో ఫ్లీట్) నకిలీ గుర్తింపులు, సర్టిఫికెట్లు ఇస్తూ చమురు రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో చండీగఢ్‌‌‌‌కు చెందిన దంపతులతో పాటు వారి సంస్థలపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 

చమురు రవాణా కోసం వివిధ దేశాల ఫేక్ గుర్తింపులు, దొంగ సర్టిఫికెట్లను సమకూరుస్తున్నందుకుగాను ఈ చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది. ఈమేరకు బుధవారం అమెరికా ట్రెజరీ డిపార్ట్‌‌‌‌మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. 

చండీగఢ్‌‌‌‌కు చెందిన సునీల్ కుమార్ శర్మ, ఆయన భార్య జస్ప్రీత్ ప్రీతి షాహిద్‌‌‌‌లు పలు దేశాల సముద్రయాన నియంత్రణ సంస్థలను బురిడీ కొట్టిస్తూ నౌకలకు దొంగ నంబర్ ప్లేట్లు (రిజిస్ట్రేషన్లు) ఇచ్చే ‘ఫ్లాగింగ్ ఏజెన్సీల’ను నడుపుతున్నారు. 

గయానా, ఎస్వాటిని, లావోస్ దేశాల ప్రతినిధులుగా నటిస్తూ.. ఇరాన్ సైన్యానికి చెందిన నౌకలు అంతర్జాతీయ ఆంక్షల కన్నుగప్పి సముద్రంలో తిరిగే వీలుకల్పిస్తున్నారు. 2023లో సునీల్ శర్మ సింగపూర్ వేదికగా ‘ఎస్వాటిని మెరైన్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ షిప్ రిజిస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దీంతో ఇరాన్ చమురు నౌకలకు ఇది నకిలీ ఫ్లాగింగ్ సేవలను కొనసాగిస్తూనే ఉందని అమెరికా తెలిపింది.